ఒకవైపు జనసేన కు రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జనసేనకు రాజీనామాలే వార్తల్లోకి వస్తున్నాయి. పవన్ కల్యాణ్ హడావుడి మొదలుపెట్టిన తర్వాత వాటి వేగం మరింత పెరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుల, మత రాజకీయాలను నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. మతాన్ని, కులాలను రెచ్చగొట్టే పనిలో ఆయన బిజీగా కనిపిస్తూ ఉన్నారు.
తను కమ్యూనిస్టు, తనకు చేగువేరా ఆదర్శం అంటూ వల్లించిన పవన్ కల్యాణ్ చివరకు తన రాజకీయ మనుగడకు కులాన్ని, మతాన్ని నమ్ముకునే స్థితికి వచ్చారు. ఒకవైపు మతం, కుల విద్వేషాలను రెచ్చగొడుతూనే.. అలాంటి రాజకీయాలు ఆపాలంటూ పవన్ చిలకపలుకులు పలుకుతూ ఉండటం ఆయన విద్వేష రాజకీయానికి అద్దం పడుతూ ఉంది.
మరి ఈ విద్వేష రాజకీయం పవన్ ను ఎంత వరకూ నిలబెడుతుందో ఎవరికీ తెలియదు. మరోవైపు జనసేన విలీనానికి పవన్ అన్ని ఏర్పాట్లూ చేస్తూ ఉన్నారనే ప్రచారమూ సాగుతూ ఉంది. త్వరలోనే తమకు రోజులొస్తాయని పవన్ చెబుతూ ఉన్నారు. బీజేపీలోకి జనసేనను విలీనం చేయడమే ఆ మంచి రోజుల ఉద్దేశమని పవన్ వ్యాఖ్యల్లోని మర్మాన్ని పరిశీలకులు బయటపెడుతూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. జనసేన విలీనం వీలైనంత త్వరగా జరిగిపోనుందనే టాక్ మొదలైంది. అందుకు కారణం.. జనసేనకు కొనసాగుతున్న రాజీనామాలే. ఉన్న వాళ్లు చాలా మంది జారిపోయారు. మరింత మంది అలా జారిపోక మునుపే పవన్ కల్యాణ్ తన పార్టీని విలీనం చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. లేటైతే.. విలీనం కావడానికి పవన్ కల్యాణ్ తప్ప ఎవరూ మిగలకపోవచ్చని తెలుస్తోంది. జనసేన విలీనం ప్రతిపాదనకు పవన్ వెంట అనునిత్యం కనిపిస్తున్న నాదెండ్ల మనోహర్ కూడా వ్యతిరేకమే అనే ప్రచారం సాగుతూ ఉంది. విలీన ప్రకటన వచ్చే సమయానికి మనోహర్ కూడా పవన్ కు గుడ్ బై చెప్పనున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.