సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయాలకు బాధ్యుడిగా తనను తను ప్రకటించుకున్నట్టుగా.. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ ఆ పదవి నుంచి తప్పుకున్నాకా..ఆ సీటు కొంత కాలం ఖాళీగా ఉండింది. ఎవరో ఒక డమ్మీ నేతను ఆ స్థానంలో కూర్చోబెట్టబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే డమ్మీని కూర్చోబెట్టినా మళ్లీ తొలగించడం అయితే అంత తేలిక కాదు.
దానికి అనేక సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అందుకేనేమో చేసేది లేక సోనియాగాంధీనే మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. సోనియా ఆ స్థానం నుంచి దిగిపోయి రాహుల్ కు బాధ్యతలు అప్పగించడానికి పెద్దగా రీజన్లను చెప్పనక్కర్లేదు. అలా రాహుల్ పునరాగమనానికి తగినట్టుగా స్టేజ్ ను సెట్ చేశారు.
ఇక రాహుల్ గాంధీని తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, రాహుల్ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి జాతీయ మీడియాకు. పౌరసత్వ సవరణల చట్టం పై రాహుల్ గర్జిస్తూ ఉన్నారు. ఈశాన్యంలో రేగిన మంటలకు మోడీనే బాధ్యత వహించాలని రాహుల్ అంటున్నారు. మధ్యలో ఆర్ఎస్ఎస్ మీదా హాట్ కామెంట్స్ కొనసాగిస్తూ ఉన్నారు.
'క్షమాపణలు చెప్పడానికి నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, రాహుల్ గాంధీ..' అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఇంకా వివిధ అంశాల మీద కేంద్రంపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఇటీవలే వయనాడ్ వెళ్లిన రాహుల్ గాంధీకి అక్కడా మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాహుల్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారని.. జనవరి 15 లోగా ఆయన మళ్లీ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు అవుతారని కాంగ్రెస్ వర్గాలు మీడియాకు లీకులిస్తున్నాయి.