ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించడానికంటూ అవతరించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలను చూస్తూ నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. ముందు ఇంటిని చక్కదిద్దుకోకుండా ఆ పార్టీ ఏదేదో ఆలోచిస్తోంది.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయాలని ఆరాట పడుతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. ఇదే సందర్భంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి బదులు విస్మరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది జనసైనికుల నుంచి వస్తున్న ప్రశ్నలు.
రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. రహదారుల మరమ్మతుల విషయంలో గతంలో చంద్రబాబు కూడా పట్టించుకోలేదు. అదే పరంపర ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి మూడున్నరేళ్ల పాటు జనసేన మిత్రపక్షంగా కొనసాగింది. అప్పట్లో మంచికి, చెడుకి చంద్రబాబు ప్రభుత్వాన్ని జనసేనాని వెనకేసుకొచ్చారు.
తాజాగా రహదారుల మరమ్మతుల విషయమై ఆన్లైన్ ఉద్యమానికి జనసేన పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల చిత్రాలను ఆన్లైన్ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది.
టెండర్లను కూడా పిలిచినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ప్రభుత్వ పరంగా స్పందించకపోతే అక్టోబర్ 2న రోడ్లపైకి జనసేనాని పవన్‌కల్యాణ్ వచ్చి శ్రమదానం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
రోడ్లను బాగుపరిచే చర్యలు ఎవరు చేపట్టినా మంచిదే. ఇదే సమయంలో తన పార్టీని బాగుపరిచేందుకు పవన్‌కల్యాణ్ శ్రమదానం చేయాల్సిన అవసరం ఉందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. ఇది అధినేత చెవికెక్కించుకుంటే ఆ పార్టీకి భవిష్యత్ ఉంటుంది.