నటి వాణీ విశ్వనాథ్ తమ పార్టీలోకి రావాలని జనసైన కార్యకర్తలు కోరుతున్నారు. ఆమె కోసం జనసేన కార్యకర్తలు ర్యాలీ చేయడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో నగరిలో రోజాపై పోటీ చేస్తానని నటి వాణీ విశ్వనాథ్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఉన్నారు. ఇక జనసేనకు సరైన అభ్యర్థి లేరు.
ఈ నేపథ్యంలో తమ పార్టీలో చేరి రోజాపై పోటీ చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఈ మేరకు వాణీ విశ్వనాథ్ ప్లెక్సీలతో జనసేన పుత్తూరులో ర్యాలీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేరళకు చెందిన వాణీ విశ్వనాథ్ తెలుగుతో తమిళ సినిమాల్లో కూడా నటించారు.
1989లో హీరోయిన్‌గా తెలుగులో అవకాశం వచ్చింది. 'ఘరానా మొగుడు' చిత్రంతో గ్లామర్ హీరోయిన్‌గా వాణీ విశ్వనాథ్ టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్నారు.
చెన్నైలో స్థిరపడిన ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తెలుగు రాజకీయాలపై ఆమె ఆసక్తికనబరచడం విశేషం. జనసేన ఆహ్వానంతో ఆ పార్టీలోకి వెళ్లి ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది కాలమే తేల్చాల్సి ఉంది.