శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఒకేసారి లక్షల కొద్దీ టికెట్లు

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు.. ఇన్నాళ్లూ నెల రోజులకు మాత్రమే సరిపడేలా ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేశారు. దీంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమందికి టికెట్లు దొరక్క, మరికొంతమందికి టికెట్…

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు.. ఇన్నాళ్లూ నెల రోజులకు మాత్రమే సరిపడేలా ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేశారు. దీంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమందికి టికెట్లు దొరక్క, మరికొంతమందికి టికెట్ దొరికినా, రూమ్స్ దొరక్క ఇబ్బంది పడ్డారు. కరోనా ఆంక్షల వల్ల ఇలా పరిమితంగా టికెట్లు రిలీజ్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు శ్రీవారి భక్తులకు శుభవార్త మోసుకొచ్చింది.

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఒకేసారి గంపగుత్తగా విడుదల చేయబోతోంది టీటీడీ. ఒకటి కాదు, రెండు కాదు.. 92 రోజులకు సంబంధించి ఏకంగా 25 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయబోతున్నారు.

ముందుగా ఈనెల 21న ఏప్రిల్ నెల కోటాను, 22వ తేదీన మే నెల కోటాను, 23న జూన్ నెల కోటాను… ఇలా 3 రోజుల్లో 3 నెలలకు సరిపడ ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను విడుదల చేయబోతున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ఈ టికెట్లన్నీ ఆన్ లైన్ లో లభ్యం అవుతాయి.

ఇవి కాకుండా సర్వదర్శనం టికెట్లను రోజుకు 30వేల చొప్పున ఆఫ్ లైన్ లో కేటాయిస్తారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో సర్వదర్శనం టికెట్లు పొందవచ్చు. ఇక ఆర్జిత సేవలకు సంబంధించి రేపు టీటీడీ అధికారిక సైట్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. భక్తుల ఆదరణ పొందిన కల్యాణోత్సవం టికెట్లతో పాటు ఆన్ లైన్ లక్కీ డిప్ ద్వారా కేటాయించే ఇతర సేవల టికెట్లను కూడా రేపట్నుంచి అందుబాటులో ఉంచుతున్నారు.

ఓవైపు ఇలా టికెట్ల సంఖ్యను పెంచినప్పటికీ, మరోవైపు తిరుమల కొండపై కరోనా ఆంక్షలు మాత్రం కొనసాగబోతున్నాయి. దర్శనం లేదా ఆర్జిత సేవా టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. దీంతో పాటు కరోనా వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు సర్టిఫికెట్ తప్పనిసరి.