జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ స్పీచ్ తర్వాత రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతాయని అంటున్నారు. 2014లో మాదిరిగా వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడుతాయని అంటున్నారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనే చీల్చే ప్రసక్తే వుండదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీని పవన్ రోడ్ మ్యాప్ అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన మనోభీష్టం మేరకు బీజేపీ వ్యవహరించికపోతే జనసేనాని టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి విడాకులు ఇచ్చేందుకు జనసేనాని వెనుకాడరనే చర్చ జరుగుతోంది. త్వరలో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారని రాజకీయ నేతలు, విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, జనసేన నేతలు పొత్తు కుదుర్చుకోవడమే తప్ప అసలు కలిసి ప్రయాణించిన దాఖలాలు ఎక్కడ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు బీజేపీ, జనసేన నేతలు కలిసి వుంటే కదా, విడిపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కావడానికి అనే వాదన తెరపైకి వచ్చింది. కడపలో ఇవాళ బీజేపీ నేతృత్వంలో సీమ రణభేరి నిర్వహిస్తోంది. జనసేనతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ ఇటీవల అన్నారు. కానీ ఆ సభతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇలా ఇలాంటివి ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదల్లో బీజేపీతో పొత్తు కోసం జనసేన వెంపర్లాడింది. చివరికి నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు మమ అనిపించారు. ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేస్తామని నాడు చెప్పుకున్న ఊసులు, కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
బాబుపై మనసు పెట్టుకుని, బీజేపీతో అంటకాగడం కాలక్రమం పవన్‌కు నచ్చినట్టు లేదు. అందుకే ఆ పార్టీతో దూరంగా ఉంటూ, కేవలం వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన కలయికపై సోషల్ మీడియాలో బోలెడు సెటైర్లు.