జరిమానాల లొల్లి: మమత వర్సెస్‌ మోడీ.!

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ట్రాఫిక్‌ జరిమానాల పెంపు వ్యవహారంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెదవి విరిచారు. 'మానవతా దృక్పథంతో వ్యవహరించాలి తప్ప.. ప్రజల్ని వేధించకూడదు.. జరిమానాల పెంపు ఒక్కటే ప్రమాదాల్ని…

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ట్రాఫిక్‌ జరిమానాల పెంపు వ్యవహారంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెదవి విరిచారు. 'మానవతా దృక్పథంతో వ్యవహరించాలి తప్ప.. ప్రజల్ని వేధించకూడదు.. జరిమానాల పెంపు ఒక్కటే ప్రమాదాల్ని నివారిస్తుందని అనుకోవడం తప్పు. జరిమానాల పెంపుకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని మమతా బెనర్జీ తేల్చిచెప్పడం గమనార్హం.

మరోపక్క, దేశంలోని పలురాష్ట్రాల్లో ఇప్పటికే పెంచిన జరిమానాలు అమల్లోకి వచ్చేశాయి. పెంచిన జరిమానాల దెబ్బకి కొందరు వాహనదారులు తమ వాహనాల్ని ట్రాఫిక్‌ పోలీసులకి అప్పగించేసి వెళ్ళిపోతున్నారు. తమ వాహనాల ఖరీదుని మించిపోయేలా జరిమానాలు వుండడాన్ని వాహనదారులు తప్పుపడుతున్నారు. అయితే, పెద్దమొత్తంలో జరిమానాలు వుంటేనే, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు తగ్గుతాయన్నది కేంద్రం వాదన.

తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ఒకప్పటి 100 రూపాయల విలువకీ, ఇప్పటి 100 రూపాయల విలువకీ తేడా ప్రస్తావిస్తూ, ఈ జరిమానాలు ప్రజల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ, ట్రాఫిక్‌ రూల్స్‌ పట్ల అవగాహన పెంచుతాయని సెలవిచ్చారు. అయితే, గుజరాత్‌లో మాత్రం పెంచిన జరిమానాల్ని సగానికి తగ్గించడం గమనార్హం.

బీజేపీ అధికారంలో వున్న గుజరాత్‌లోనే ట్రాఫిక్‌ జరీమానాల విషయమై ప్రజల డిమాండ్లకు అక్కడి ప్రభుత్వం తలొగ్గినప్పుడు.. దేశంలో మిగతా రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు సమర్థించాలి.? అన్న చర్చ జరుగుతోంది.

ప్రభుత్వాలు ట్రాఫిక్‌ ఉల్లంఘనల ద్వారా ఖజానా నింపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయన్న విమర్శలు సాధారణ ప్రజానీకం నుంచి వ్యక్తమవున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మమతా బెనర్జీకి మద్దతుగా దేశంలో ఏయే రాష్ట్రాలు నిలబడ్తాయన్నది వేచి చూడాల్సిందే.

ఒక్కటి మాత్రం నిజం.. ట్రాఫిక్‌ రూల్స్‌ అనేవి ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకుని రూపొందించినవే. అయినప్పటికీ, దురదృష్టవశాత్తూ అవి ప్రభుత్వాలకు ఆదాయ వనరులుగా మారిపోయాయన్నదీ నిర్వివాదాంశం.  

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!