ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ సినిమాకు ముగింపు అక్క‌డే…

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ, ఒక్క విష‌యంలో మాత్రం ఆ పార్టీ స‌క్సెస్ అయ్యింది. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి రాష్ట్రంలో అస‌లు ఉనికే లేకుండా చేసిన ఘ‌న‌త…

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ, ఒక్క విష‌యంలో మాత్రం ఆ పార్టీ స‌క్సెస్ అయ్యింది. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి రాష్ట్రంలో అస‌లు ఉనికే లేకుండా చేసిన ఘ‌న‌త మాత్రం టీడీపీకే ద‌క్కుతుంది.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నోటా కంటే తక్కువ‌గా, క‌నీసం ఒక్క శాతం ఓట్లు కూడా జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఏపీలో ద‌క్క‌లేదంటే, అది ముమ్మాటికీ టీడీపీ కొట్టిన దెబ్బే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీని మ‌రోసారి చావు దెబ్బ తీసేందుకు టీడీపీ, వైసీపీ వ్యూహ ర‌చ‌న చేస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అది కూడా ద‌ళిత నేత‌ల‌ను ముందు పెట్టి బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను టీడీపీ సంధిస్తోంది.

బీజేపీపై టీడీపీ నేత‌, మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రంలో బీజేపీ సినిమాల‌కు తీసిపోని విధంగా ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ న‌డిపిస్తోంద‌ని మండిప‌డ్డారు.

జాతీయ పార్టీ అయిన బీజేపీకి జాతీయ విధానం లేదా? అని సూటిగా ప్ర‌శ్నించారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి జాతీయ విధానం లేక‌పోవ‌డం సిగ్గుచేట‌న్నారు. తెలంగాణ‌లో బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య వైరాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసి గ‌ట్టిగా నిల‌దీశారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై తెలంగాణ‌లో లేని అభిమానం తిరుప‌తిలో మాత్రం ఎందుకో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చెప్పాల‌ని జ‌వ‌హ‌ర్ డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల్సిన జ‌న‌సేన పోటీ నుంచి విర‌మిస్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఏ విధంగా తిరుగులేని నాయ‌కుడిగా చేస్తారో చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అలాగే ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ ఏ ఫైల్ పంపినా ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా అర్ధగంటలో గవర్నర్ క్లియరెన్స్ చేయ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌పై ఎందుకంత అభిమాన‌మో చెప్పాలని జవహర్ అన్నారు. 

బీజేపీకి సహకరిస్తున్న జగన్‌కు గవర్నర్ ద్వారా రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారని ఆయ‌న అన్నారు. జగన్‌పై బీజేపీ విమర్శ కేవ‌లం పైకి మాత్ర‌మేన‌ని, లోలోపల మాత్రం ఆ రెండు పార్టీల మ‌ధ్య గ‌ట్టి అనుబంధం ఉందన్నారు. బీజేపీ-జ‌న‌సేన‌, వాటి మ‌ధ్య‌లో వైసీపీ ట్ర‌యాంగిల్ సిని మాకి ముగింపు పలకాల్సింది తిరుపతి ప్రజలే అని జవహర్ చెప్పుకొచ్చారు.