విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దాంతో పాటుగా మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. అదే సమయంలో నానాటికీ విస్తరిస్తున్న నగరానికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు.
దాదాపుగా పుష్కర కాలం క్రితం విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రతిపాదన చేసినా కూడా అయినా నాటి పాలకులు పట్టించుకోలేదు. మళ్ళీ పాత ఫైల్ దుమ్ము దులిపి రైలు కూత పెట్టించే పనులే ఇపుడు జోరుగా సాగుతున్నాయి.
ఈ నేపధ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ రీజనల్ ఆఫీస్ కూడా విశాఖలో ఆ మధ్యన ప్రారంభించారు. ఇపుడు డీపీయార్ రెడీ అవుతోంది. తొందరలోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను 73.31 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్ల పరిధిలో ఏర్పాటు చేస్తారు. మొత్తం 52 స్టేషన్లు రానున్నాయి. ఇక ప్రాజెక్ట్ నిర్మాణానికి 15, 933 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. మూడు దశలలో మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూస్తారు.