ఎప్పుడు, ఎవరిని, ఎలా మాట్లాడుతారో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికే తెలియదేమో. తానొక మాట అంటే, అవతలి వారు ఎంత నొచ్చుకుంటారో అనే కనీస ఆలోచన కూడా ఆయన చేయడం లేదు. రాజకీయాల నుంచి విరమించుకున్నానని ప్రకటించిన తర్వాత, జేసీ బ్రదర్స్ వారసులిద్దరూ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కావడం ఓర్వలేనితనమో లేక తమ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడనే కక్షో తెలియదు కానీ, జగన్‌పై రెండురోజులకో సారి ఏదో ఒక సంచలన కామెంట్ చేయనందే జేసీకి నిద్రపట్టనట్టుంది. తాజాగా జగన్‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లపై జేసీ నోరు పారేసుకున్నాడు.
కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్ల కంటే తమ ఆడవాళ్లు మేలని ఆయన వ్యంగ్యంగా అన్నాడు. అమరావతి నుంచి రాజధాని తరలించొద్దనే డిమాండ్‌పై గత నెల రోజులుగా అక్కడి రైతులు ఆందోళన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజధాని మహిళా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనబాట పట్టారు. సంక్రాంతి పండగ నాడు జేసీ దివాకర్‌రెడ్డి అక్కడికి వెళ్లి వారికి మద్దతు కూడా ప్రకటించాడు.
ఇప్పుడు ఉన్నట్టుంది కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లను ఎందుకు తిట్టాల్సి వచ్చిందో జేసీకే తెలియాలి. కృష్ణా, గుంటూరు మగవాళ్ల కంటే రాయలసీమ ఆడవాళ్లు మేలని పోల్చడాన్ని సీమ వాసులు తప్పు పడుతున్నారు. లింగ భేదంతో ఎక్కువ, తక్కువ, మంచీచెడులను బేరీజు వేయడం సబబు కాదని రాయలసీమ వాసులు హితవు చెబుతున్నారు. ఇక జగన్‌పై రొటీన్‌గా ఆయన అవాకులు చెవాకులు పేలాడు.