బిగ్‌బాస్-3 రన్నర్‌గా నిలిచిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి తన ఆనందానికి అవధుల్లేవని ప్రకటించారు. ఇంతకూ శ్రీముఖికి అవధుల్లేని ఆనందాన్ని ఇచ్చిన సంఘటన ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆ పాయింట్ వద్దకే వెళ్దాం.
మైకు లేకుండానే అందరికీ విన్పించేలా మాట్లాడగలిగే గొంతున్న శ్రీముఖి బిగ్‌బాస్-3లో చేసిన అల్లరి అంతాఇంతా కాదు. పుట్టుకతోనే గొంతులో మైక్ ఏమైనా ఉందా అనే అనుమానం ఆమె అరుపులు వింటే కలగడం సహజం. బిగ్‌బాస్-3 రన్నర్‌గా నిలిచినా పాపులారిటీలో మాత్రం విన్నర్ కంటే ఎక్కువే. అలాంటి శ్రీముఖికి లేడీ అమితాబ్ విజయశాంతి చేసిన ఒకే ఒక్క కామెంట్ అవధుల్లేని ఆనందాన్ని ఇచ్చింది.
‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్ ఫంక్షన్‌కు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శ్రీముఖిని గుర్తు పట్టిన విజయశాంతి ‘చిన్న రాములమ్మ’ అని పిలిచారు. ఈ విషయాన్ని శ్రీముఖి చెబుతూ, విజయశాంతి నోట అలా పిలుపించుకోవడం ‘నాకు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు.
విజయశాంతి తనను అలా పిలుస్తున్న క్షణంలో తన నోట మాట రాలేదని, జీవితాంతం గుర్తించుకుంటానని సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. 2020లో తొలి రోజుల్లోనే చిరస్మరణీయమైన జ్ఞాపకాన్ని మిగిల్చిన విజయశాంతితో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు.