ఎట్ట‌కేల‌కు అఖిల‌ప్రియ‌కు అండ‌గా నిలిచిన సీమ నేత‌

కిడ్నాప్ వ్య‌వ‌హారంలో జైలుపాలైన మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియకు ఎట్ట‌కేల‌కు ఓ టీడీపీ నేత మ‌ద్ద‌తుగా నిలిచారు. భూమా అఖిల అరెస్ట్‌పై ఇంత వ‌ర‌కూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్‌, పార్టీ…

కిడ్నాప్ వ్య‌వ‌హారంలో జైలుపాలైన మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియకు ఎట్ట‌కేల‌కు ఓ టీడీపీ నేత మ‌ద్ద‌తుగా నిలిచారు. భూమా అఖిల అరెస్ట్‌పై ఇంత వ‌ర‌కూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్‌, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు  నోరు మెద‌ప‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో అఖిల‌ప్రియ అరెస్ట్‌ను అనంత‌పురం టీడీపీ పార్ల‌మెంట్ ఇన్‌చార్జి జేసీ ప‌వ‌న్‌రెడ్డి ఖండించి… ఆమెకు అండ‌గా నిలిచిన మొట్ట‌మొద‌టి టీడీపీ నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాడిప‌త్రిలో త‌న ఇంట్లో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అఖిల‌ప్రియ అరెస్ట్‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం మ‌హిళ‌ని కూడా చూడ‌కుండా రాత్రి వేళ అఖిల‌ను అరెస్ట్ చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తెలంగాణ ప్ర‌భుత్వంతో ఏపీ స‌ర్కార్‌కు స‌త్సంబంధాలున్నాయ‌ని, భూమా అఖిల‌ప్రియ‌ను ఎలాంటి విచార‌ణ లేకుండా అరెస్ట్ చేయడం వెనుక అనుమానాలుండ‌డానికి అదే కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. క‌నీసం విచార‌ణ కూడా లేకుండా అఖిల‌ప్రియ‌ను అరెస్ట్ చేయ‌డం అభ్యంత‌ర‌క‌ర‌మ‌న్నారు. అఖిల‌ప్రియ‌పై ఆళ్ల‌గ‌డ్డ‌లో కూడా ఏపీ ప్ర‌భుత్వం అనేక కేసులు పెట్టింద‌న్నారు.

ఏపీ స‌ర్కార్ ఓ ప‌థ‌కం ప్ర‌కారం ఉత్త‌రాంధ్ర‌లో అచ్చెన్నాయుడిని, కోస్తాలో కొల్లు ర‌వీంద్ర‌ను, రాయ‌ల‌సీమ‌లో త‌న కుటుంబ స‌భ్యులైన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు జేసీ అస్మిత్‌రెడ్డిల‌పై కేసులు పెట్టి జైళ్ల‌కు పంపింద‌ని ప‌వ‌న్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రాయ‌ల‌సీమ‌కే చెందిన అఖిల‌ప్రియ‌ను కూడా అరెస్ట్ చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అఖిల‌ప్రియ కేసు విష‌య‌మై నిష్పాక్షికంగా విచార‌ణ జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మొత్తానికి అరెస్ట్ అయిన మూడు రోజుల‌కు క‌నీసం జేసీ ప‌వ‌న్‌రెడ్డి అయినా అఖిల‌ప్రియ‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ