బీజేపీ మార్కు రాజకీయం అక్కడ కూడా మొదలైంది

సామ, దాన, భేద, దండోపాయాలతో ఒక్కో రాష్ట్రాన్నీ వశపరచుకుంటున్న బీజేపీ ఇప్పుడు బీహార్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. అదేంటి బీహార్ లో ఉన్నది ఎన్డీయే సర్కారే కదా అనుకుంటున్నారా. అయినా కూడా బొటాబొటీ…

సామ, దాన, భేద, దండోపాయాలతో ఒక్కో రాష్ట్రాన్నీ వశపరచుకుంటున్న బీజేపీ ఇప్పుడు బీహార్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. అదేంటి బీహార్ లో ఉన్నది ఎన్డీయే సర్కారే కదా అనుకుంటున్నారా. అయినా కూడా బొటాబొటీ మెజార్టీ కమలనాధులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. 

ఆ నిద్రేదో పక్కనోళ్లకి లేకుండా చేయాలనే ఉద్దేశంతో బీహార్ లో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఒకే దెబ్బతో కాంగ్రెస్ ని పడగొట్టడం, మిత్ర పక్షమైన జేడీయూని బలహీన పరిచే వ్యూహాన్ని అమలులో పెట్టింది. కాంగ్రెస్ నుంచి 11 మంది ఎమ్మెల్యేలను లాగేసుకోబోతోంది బీజేపీ. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ఐదేళ్ల పాటు అధికారం చేజారకుండా చూసుకోవడం బీజేపీ ముందున్న తక్షణ కర్తవ్యం మరి.

బీజేపీ, జేడీయూ కలయికలోని ఎన్డీఏ కూటమికి 125 సీట్లు వచ్చాయి. పాస్ మార్కుల కంటే కేవలం 3 మాత్రమే అదనం. ప్రతిపక్ష మహా ఘట్ బంధన్ ఏకంగా 110 స్థానాల్లో గెలిచింది. ఇక్కడే బీజేపీ ఆలోచనలో పడింది.

వాస్తవానికి ముఖ్యమంత్రి పీఠం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా కూడా.. పరాభవ భారంలో ఉన్న నితీష్ ని గద్దెనెక్కించి తోలుబొమ్మలా ఆడిస్తోంది బీజేపీ. అయితే బలంగా ఉన్న ప్రతిపక్షంతో ఎప్పటికైనా బీజేపీకి ఇబ్బందే. అందుకే బొటాబోటిగా ఉన్న 125 సీట్ల మెజార్టీని 136కి పెంచుకోబోతోంది. ప్రతిపక్షాన్ని వందలోపుకి కుదించేసి బలహీన పరిచేలా పావులు కదుపుతోంది.

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో కలసి అధికారాన్ని పంచుకున్న జేడీయూ.. వివిధ కారణాలతో బైటకొచ్చేసి బీజేపీతో జట్టు కట్టింది. అదే సమయంలో.. కాంగ్రెస్ నుంచి కూడా వలసలు జరిగాయి. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సైతం నితీష్ తో కలసి బీజేపీ పంచన చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు.

తాజాగా ఇప్పుడు మరోసారి బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా సహా 11మంది ఎమ్మెల్యేలు గోడదూకేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆ 11మంది ఎవరనే లిస్ట్ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పంపారు భరత్ సింగ్ అనే సీనియర్ నేత. దీంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది.

కర్నాటకలో ఏకంగా ప్రభుత్వాన్ని కూలదోసి ఎమ్మెల్యేలను కొనేసి, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసి అధికార పీఠం ఎక్కింది బీజేపీ. ఉప ఎన్నికల గెలుపుతో దర్జాగా ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకుంది. ఇప్పుడు బీహార్ లో కూడా ఇదే సీన్ రిపీటయ్యేలా కనిపిస్తోంది. 

ఒకవేళ 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, వారికి ఆర్థిక సాయం అందించి మరోసారి అవే స్థానాల్లో నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తోంది బీజేపీ. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో ఐదేళ్లు కాలం గడిపే కంటే.. బలం పెంచుకుని పూర్తి కాన్ఫిడెన్స్ తో అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటోంది.

దర్శకుడిగా మారుతున్న రవితేజ

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?