తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారారు. ఆయన ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ అనారోగ్యాన్ని సాకుగా చూపాలా? అని బండి సంజయ్ నిలదీశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని సంజయ్ ఆకాంక్షించారు. కేటీఆర్ కేబినెట్‌లో పదవుల కోసం అధికార పార్టీ టీఆర్ఎస్‌లో జగడం జరుగుతోందన్నారు.
కేటీఆర్ కేబినెట్‌లోకి తీసుకోకపోతే… కొత్త పార్టీ పెట్టేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భాష గురించి కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు.
కేసీఆర్ దగ్గరే తాను భాష నేర్చుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. కమీషన్ల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తోం దని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. సీఐ స్థాయి అధికారి దగ్గర కూడా సీఎంవో అధికారులు కమీషన్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ మాటలు ఓట్లు రాలుస్తాయో లేదో తెలియదు కానీ, తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంలో బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం, అలాగే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనే వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా వర్కౌట్ అవుతుండడంతో అదే పంథాలో బండి దొర్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.