ఎట్టకేలకు 54 రోజుల తర్వాత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం కోర్టు బెయిల్ ఇవ్వడంతో కడప సెంట్రల్ జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో తండ్రీకొడు కులు అరెస్ట్ అయ్యారు. 54 రోజులుగా వారిద్దరూ కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఇటీవల బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు తీవ్రమైందని, తాము ఆదేశాలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది. దీంతో జేసీ తరపు లాయర్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టు ఆదేశాల మేరకు కింది కోర్టును ఆశ్రయించారు.
అనంతపురం కోర్టులో వారికి బెయిల్ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమ నాయకులకు బెయిల్ లభించి విడుదల వుతున్నారనే సమాచారంతో జేసీ అనుచరులు పెద్ద ఎత్తున కడప సెంట్రల్ జైలుకు తరలివచ్చారు. జైలు నుంచి బయటికొచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా తాడిపత్రికి వెళ్లారు.