రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి పునర్నియామకమైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఇప్పట్లో పనేం లేదు. స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ జగన్ సర్కార్ ఈ రోజు సాయంత్రం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
శ్రీకాకుళంలోని కార్పొరేషన్‌లో అక్టోబర్ 10 వరకు, మిగిలిన అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలో మాత్రం డిసెంబర్ 31 వరకు ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికారులతో చర్చిస్తున్నట్టు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించి రెండు రోజులు కూడా గడవకనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్‌లో, జూన్ 30న మున్సిపాలిటీలలో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను గత మార్చిలో వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా ఏ మాత్రం తగ్గకపోగా…రోజురోజుకూ విజృంభిస్తోంది.
అసలు ఎప్పటికి తగ్గుతుందో కూడా తెలియని స్థితి. ఈ నేపథ్యంలో పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ పని తప్పినట్టైంది. అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ నిమ్మగడ్డ రమేశ్ ఆ పదవిలో ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అనుమానమే అనే అభిప్రాయం లేకపోలేదు.