బామ్మర్దులంటే బాగు కోరుకునే వారని పెద్దలు అంటారు. అదే రకంగా బావలు కూడా భార్య ఇంటి వైపు వారి మంచినే కోరుకుంటూ ఉంటారు. అయితే ఇందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం మినహాయింపనే చెప్పాలి.
తన భార్య సోదరుడు, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జైలు ఊచలు లెక్కించాలని కోరుకోవడం గమనార్హం. తన బామ్మర్దిపై పోలీసులు కేసు ఎందుకు పెట్టలేదని ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల క్రితం నెల్లూరు ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోలీసు సంఘంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘నా భార్య సోదరుడు ప్రసన్నకుమార్‌రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే కేసుల్లేవు. నాకే బాధేస్తుంది. నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే.. నేను ఏదో అన్నానని పోలీసు అసోసియేషన్ అంటోంది. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. ఇంత దారుణంగా పోలీస్ పరిస్థితి ఉంది. నాకో న్యాయం? నా బామ్మర్దికో న్యాయమా?. జెండా ఒక్కటే తేడా. నాది పచ్చది.. వాళ్ళది బ్లూ కలర్’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు నడుచుకుంటూ పోలీసుల పరువు తీయొద్దని పోలీస్ సంఘాన్ని జేసీ కోరారు. పోలీసు సంక్షేమ సంఘానికి ఎందుకింత పక్షపాతమని ఆయన ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేయకపోయినా, ఫిర్యాదు చేసిన సంఘానికి తన బామ్మర్ది మాటలు వినిపించలేదా? అని జేసీ ప్రశ్నించారు. పోలీసులు ఎందుకీ తేడా చూపుతున్నారని ఆయన నిలదీశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పోలీసు సంఘం ఎంత కాలం ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పోలీసులను ఆదేశిస్తే.. ఇక మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవసరమా? ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారని నిలదీశారు. తమ ఇంట్లోకి వచ్చి తమపైనే కేసులు పెడతారా? అని జేసీ ప్రభాకర్‌రెడ్డి నిలదీయడం గమనార్హం.