టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఘాటు వ్యాఖ్యలపై రియాక్షన్ వచ్చింది. “రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు… మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్ మాట వింటాడా? కాంగ్రెస్ మాట వింటాడా? ఈ ప్రతిపక్షాలన్నీ విఫలమయ్యాయి” అని షర్మిల వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దీటుగా స్పందించారు.
రేవంత్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నిన్నమొన్న పార్టీ పెట్టిన వాళ్ల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన కొట్టి పారేశారు. అసలు ఆమె ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని షర్మిలను ఉద్దేశించి అన్నారు.
షర్మిల మాటలను తాము పెద్దగా పరిగణనలోకి తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్సార్‌టీపీని, షర్మిల విమర్శలను తాము పట్టించుకోమని ఇది వరకే రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆమె విమర్శలపై స్పందించడం అంటే షర్మిలకు ప్రాధాన్యం ఇచ్చినట్టే అని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె విమర్శలను తెలంగాణ పార్టీలు లైట్ తీసుకోవడం గమనార్హం.