విదేశీ పెట్టుబడిదారులకు హాట్ కేక్ గా మారింది జియో! ఒకవైపు ఇండియాలో టెలికాం సంస్థలు భారీ నష్టాలను చవి చూస్తూ ఉన్నాయి. కొన్ని మూతబడ్డాయి. మరి కొన్ని మెర్జ్ అయిపోయాయి. అవి మనుగడ కోసమే కష్టాలు పడుతుంటే.. ముకేష్ అంబానీ కి చెందిన జియో మాత్రం విదేశీ పెట్టుబడులను తెగ ఆకర్షించేస్తూ ఉంది! అదే విచిత్రమో మరి. విపరీత స్థాయి ఆఫర్లతో జియో ఎలా లాభాలు సంపాదిస్తోందనేది మిగతా పోటీ దారులకు అంతుబట్టని అంశంలాగుంది. మరోవైపు దానికి పెట్టుబడుదల వరద కూడా పారుతూ ఉంది! ఎంతలా అంటే.. ఇటీవలే జియోలో కొంత వాటా కొని ఫేస్ బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది.
ఇప్పుడు మరో అమెరికన్ సంస్థ అదే బాటలోకి వచ్చింది. కేకేఆర్ అనే అమెరికన్ సంస్థ జియోలో వాటాలు కొనుగోలు చేసింది. ఈ వాటాల విలువ దాదాపు 11 వేల కోట్ల రూపాయలట! రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ మొత్తానికి దక్కేది కేవలం 2.32 శాతం వాటా మాత్రమేనట! 2.32 శాతం వాటా కోసం 11,367 కోట్ల రూపాయలను వెచ్చించింది ఆ సంస్థ.
ఇలా జియో, రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ వాటాలు హాట్ కేకుల్లా మారాయి. మరో విశేషం ఏమిటంటే.. ఇలాంటి వాటాల అమ్మకం ద్వారా రిలయన్స్ భారీగా నిధుల సమీకరణ చేపట్టింది. గత కొన్నాళ్లలోనే ముకేష్ అంబానీకి చెందిన వివిధ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా దాదాపు 78,562 కోట్ల రూపాయలను సమీకరించారట. ఇంకా మరికొన్ని వాటాల అమ్మకం జరగనుందని సమాచారం. స్థూలంగా 1.61 లక్షల కోట్ల రూపాయల రూపాయల అప్పులున్నాయట ముకేష్ అంబానీ సంస్థలకు. ఇప్పుడు తన ఆధీనంలోని వివిధ సంస్థల్లోని వాటాలు అమ్మడం ద్వారా ఆ మేరకు నిధుల సమీకరణ చేసి, అప్పులన్నీ తీర్చేయాలని ముకేష్ భావిస్తున్నారట. అమ్ముతున్నది తక్కువ వాటాల శాతమే అయినా.. ముకేష్ అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి!