మళ్లీ మూవీ బిజినెస్ లోకి రామోజీ?

మీడియా టైకూన్ రామోజీరావు మరోసారి సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ కాబోతున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆయన మరోసారి సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 2011 వరకు ఆయన వరుసగా…

మీడియా టైకూన్ రామోజీరావు మరోసారి సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ కాబోతున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆయన మరోసారి సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 2011 వరకు ఆయన వరుసగా సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ఎప్పుడైతే వరుసగా ఫ్లాపులు వచ్చాయో ఆయన సినిమాలు తీయడం ఆపేశారు. అదే టైమ్ లో ఇండస్ట్రీలో నిర్మాణ వ్యయం పెరగడం కూడా రామోజీని వెనక్కిలాగాయి. ఎందుకంటే ఆయన తీసేవన్నీ లో బడ్జెట్ సినిమాలే.

2015లో ఆయన 2 సినిమాలు నిర్మించారు. సందీప్ కిషన్ తో ఒకటి, రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో మరొకటి చేశారు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అప్పట్నుంచి ఆయన పూర్తిగా నిర్మాణ రంగానికి దూరమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన సినిమా నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నారట. మంచి కథలు దొరికితే, లో బడ్జెట్ లో సినిమాలు తీసి రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

అసలే రామోజీ గ్రూప్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఠంచనుగా ఒకటో తేదీకి జీతాలిచ్చే కంపెనీ కాస్తా.. ఇప్పుడు 8వ తేదీకి జీతాలిచ్చే స్థాయికి పడిపోయింది. లాక్ డౌన్ వల్ల ఈటీవీ నష్టాలు చవిచూస్తోంది. అటు కరోనా వల్ల పర్యాటక రంగం పూర్తిగా పడిపోయి రామోజీ ఫిలింసిటీకి సందర్శకుల సంఖ్య తగ్గబోతోంది. ఫిలింసిటీలో షూటింగ్స్ సంఖ్య కూడా పడిపోయింది. మరోవైపు రామోజీ బంగారు బాతు ఈనాడు పత్రిక కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇలాంటి టైమ్ లో రామోజీరావు మూవీ ప్రొడక్షన్ వైపు దృష్టి సారించడం ఆశ్చర్యకరమైన విషయమే.

ఉషాకిరణ్ మూవీస్.. ఈ సంస్థకు చిన్నపాటి చరిత్ర ఉంది. బ్లాక్ బస్టర్స్ లేకపోయినా మంచి సినిమాలు తీసిన ఘనత ఉంది. శ్రీవారికి ప్రేమలేఖతో మొదలైన ఈ బ్యానర్… ఆ తర్వాత మయూరి, ప్రతిఘటన, ప్రేమించు పెళ్లాడు, నువ్వే కావాలి, చిత్రం, ఆనందం లాంటి మంచి సినిమాలు తీసింది. అయితే ఈ బ్యానర్ పై ఆమధ్య కాలంలో ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. అలా ఐదేళ్లుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న రామోజీ రావు.. ఇప్పుడు మరోసారి సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నారట.

మరోసారి సినీ నిర్మాణ రంగంలోకి ఎంటరవ్వడానికి ఇదే సరైన సమయమని రామోజీ భావిస్తున్నారు. ప్రొడక్షన్ హౌజ్ తో పాటు రామోజీ రావుకు పంపిణీ వ్యవస్థ కూడా ఉంది. ఎలాగూ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఫిలింసిటీలోనే జరిగిపోతాయి. కాబట్టి మూవీ మేకింగ్ రామోజీకి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఈసారి నిర్మాణ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు రామోజీ చిన్నకొడుకు సుమన్ కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారాలు చూసుకున్నారు. సుమన్ తో పాటు రామోజీకి అత్యంత సన్నిహితులైన రామారావు లాంటి వ్యక్తులు ఉండేవారు. ఈసారి మాత్రం మరో కొత్త టీమ్ కు నిర్మాణ నిర్వహణ బాధ్యతల్ని అప్పగించాలని చూస్తున్నారు. 

వయోభారం వల్ల తన గ్రూప్ సంస్థల బాధ్యతల నుంచి దశలవారీగా తప్పుకుంటూ వస్తున్నారు రామోజీ. ఈమధ్యే ఈనాడు ఎడిటర్ పోస్ట్ నుంచి కూడా తప్పుకున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ నిర్వహణ (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారో చూడాలి. ఏదేమైనా లాక్ డౌన్ తర్వాత థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతున్న నేపథ్యంలో.. రామోజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు