రానున్న రోజుల్లో సోషల్ మీడియాదే భవిష్యత్ అని చెప్పక తప్పదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నామ మాత్రం కాను న్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్పులకు అనుగుణంగా ప్రయాణించే వాళ్లే మీడియా పోటీలో తట్టుకుని నిలబడగలు గుతారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు, ఇతరత్రా కథనాలను జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి. ఉదాహరణకు ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన కొన్ని వార్తలను పరిశీలిద్దాం.
‘ప్రజాభిప్రాయమే చెప్పా’ శీర్షికతో ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్తను ప్రచురించారు. ఈ వార్త ఉప శీర్షికగా సీఐడీ విచారణలో రంగనాయకమ్మ స్పష్టీకరణ అని ఇచ్చారు. ఇక వార్తలోకి వెళితే…‘విశాఖ పాలిమర్స్ దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు షేర్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న గుంటూరుకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మను గురువారం సీఐడీ పోలీసులు విచారించారు’ అని సాగింది.
లోపలి పేజీలో మరో వార్త. ‘అనుచిత పోస్టులు పెట్టారని మరో ఇద్దరిపై కేసు’ అనే శీర్షికతో ఇచ్చారు. ‘రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరు పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరుకు చెందిన గోగినేని పవన్‌కుమార్ కాగా, మరొకరు నెల్లూరు జిల్లాకు చెందిన సత్యంరెడ్డి’ …అని వార్త రాసుకెళ్లారు.
అలాగే ‘ఇసుక రవాణాను ప్రశ్నిస్తే కాళ్లు పట్టుకోమన్నారు’ అనే శీర్షిక, దాని ఉప శీర్షికలుగా ‘యువకుడి ఆత్మహత్యాయత్నం, ఎమ్మెల్యే, సీఐ వేధిస్తున్నారని స్వీయ వీడియోలో రికార్డు’ అని ఇచ్చారు. ఇక వార్త సారాంశం ఏంటంటే…పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు వీకర్స్ కాలనీకి చెందిన లోకేశ్‌నాయుడు అనే యువకుడు ఎమ్మెల్యే, సీఐల వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఓ సెల్ఫ్ వీడియో రికార్డు చేశాడు.
మొదటి వార్తలో సీఐడీ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ ఓ సాధారణ మహిళ. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లతో ఆమె గుర్తింపు పొందారు. అందులోని తప్పొప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. రెండో వార్తలో ప్రకాశం, నెల్లూరు ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు యువకులు మంత్రి అనిల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల కేసులు నమోదయ్యాయి. మూడో బాధితుడు కూడా తన ఆవేదనను సెల్ఫీ రికార్డు చేసి బయటికి వదిలాడు. దాంతో అతని బాధ అందరికీ తెలిసొచ్చింది.
మరి ఎక్కువ సర్క్యులేషన్, పాఠకులున్న పత్రికలు, టాప్ రేటింగ్‌లో ఉన్న చానళ్లలో వచ్చిన ఏ ఒక్క వార్త లేదా కథనం ఎందుకు సమాజంలో చర్చకు రావడం లేదు. అంటే ఆ పత్రికలు, చానళ్ల రాజకీయ ఉద్దేశాలు, వాటి వెనుక ఉన్న కుట్రలు ప్రజ లకు తెలిసొస్తున్నాయి. రోజురోజుకూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థలు తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయి. దీంతో వాటి గురించి జనం పట్టించుకోవడం మానేశారు.
ఫలానా పత్రిక లేదా చానల్‌లో ఫలానా వార్త వచ్చిందంటే…ఓహో దాంట్లో అయితే అలాగే వస్తుందిలే అని జనం ఏనాడో ఓ అభిప్రాయానికి వచ్చారు. అంతేకాదు, ఫలానా కథనం వచ్చిందంటే…అది ఏ మీడియాలో వచ్చి ఉంటుందో కూడా పాఠకులు, వీక్షకులు కళ్లు మూసుకుని చెప్పే చైతన్యాన్ని మనం చూడొచ్చు.
ఉదాహరణకు హైదరాబాద్ కేంద్రంగా నడిచే టీవీ5 అలియాస్ టీడీపీ5 , ఏబీఎన్ అలియాస్ సీబీఎన్ అనే చానళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక అంశాన్ని తీసుకుని జగన్ సర్కార్‌ను భ్రష్టు పట్టించాలని చర్చలు పెడుతుంటాయి. 24 గంటలూ ఏదో ఒక వార్తను వండివారుస్తూ ఉంటాయి. మరెందుకు వాటిపై కేసులు నమోదు కావడం లేదు. మరెందుకు వాటిపై సమాజంలో చర్చ జరగడం లేదు? అని ప్రశ్నించుకుంటే…కేవలం రాజకీయ ప్రేరేపిత చానళ్లుగా, కథనాలుగా మాత్రమే జనం వాటిని గుర్తించారు. అందుకే అవేం చేసినా వీక్షకులు పట్టించుకోవడం మానేశారు.
ఇదే ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్…ఇలా ఏదో ఒక సోషల్ మీడియా వేదికగా ఒకట్రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో లేదా శక్తిమంతమైన ఒకట్రెండు వాక్యాల కామెంట్స్, ఆకట్టుకునే ఫొటోలు పెడితే నిమిషాల వ్యవధిలో వైరల్ అవుతు న్నాయి. అంతెందుకు గాడ్సేపై సినీ నటుడు నాగబాబు చేసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు.
రానున్న కాలం సోషల్ మీడియాదే అని చెప్పక తప్పదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలది ఇక గతకాల వైభవంగా మాత్రమే మిగిలిపోనుంది. తక్కువ ధరకే ఇంటర్‌నెట్ ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత , దాని వినియోగం పెరిగింది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు…ఎవరికి వారు ఓ జర్నలిస్టే. తమ అభిప్రాయాలను నిర్భయంగా, స్వేచ్ఛగా చెప్పగలిగే అవకాశం రావడం తో ప్రత్యామ్నాయ జర్నలిజం ప్రాధాన్యం పెరిగింది.
ఇంతకాలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థలు తమ ఇష్టాయిష్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దేవి. వాటి దాష్టీకాలను, దుర్మార్గాలను నడిరోడ్డుపై నిలబెడుతూ ప్రత్యామ్నాయ జర్నలిజం రానున్న కాలం తనదేనని నిటారుగా నిలిచి చెబుతోంది. అందువల్లే రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు , ఇతరత్రా రంగాలు తమ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యవస్థగా సోషల్ మీడియా వైపు దృష్టి పెట్టారు, పెట్టాయి. ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని, సోషల్ మీడియాను బలోపేతం చేసే ఆలోచనలో అన్ని వర్గాల ప్రజలు నిమగ్నమై ఉన్నారు. అందుకు తగ్గట్టు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా సైనికులను సమకూర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ప్రత్యర్థుల మధ్య సోషల్ మీడియా వార్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
-సొదుం