సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టారు. ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ ఉద్యమించడాన్ని ఎవరూ కాదనరు. కానీ ప్రభుత్వాల్ని పడగొట్టేది, నిలబెట్టేది తామే అనే భ్రమ ఎవరిలోనైనా ఉంటే… అంతకంటే అతిశయం, విడ్డూరం మరొకటి వుండదు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న వాళ్లెవరైనా ఉన్నారా అంటే… ఉద్యోగ సంఘాలు, మీడియా అని చెప్పక తప్పదు.
ఎన్టీఆర్‌ను అధికారంలోకి తెచ్చింది తానేనని ఈనాడు అధిపతి రామోజీరావు భావనగా చెబుతుంటారు. వైఎస్ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకున్నది తానేనని ఎల్లో మీడియా 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ ప్రగల్భాలు పలికింది. 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఎల్లో మీడియా పని చేసింది.
ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడిపై జనంలో వ్యతిరేకత పెంచడంలో లేదా అభిమానం క్రియేట్ చేయడంలో మీడియా పాత్ర ఎంతోకొంత వుంటుంది. ఇది కాదనలేని వాస్తవం. అయితే సమస్తం తమ వల్లే జరుగుతుందనే అతిశయమే మీడియాను అభాసుపాలు చేస్తోంది. మీడియా విశ్వసనీయత ఏపాటిదో ప్రస్తుత ప్రజానీకానికి బాగా తెలుసు.
రాత, విజువల్ వెనుక ఏ రాజకీయ ఎజెండా ఉన్నదో పాఠకులు, ప్రేక్షకులు వెంటనే పసిగట్టగలుగుతారు. అందుకే తమకు నచ్చిన నాయకుడే పాలకుడిగా ఉండాలనే ఎల్లో మీడియా ఆటలు… ప్రజాచైతన్యం ముందు సాగలేదు. మున్ముందు కూడా సాగవు.
ప్రస్తుతానికి వస్తే…పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు, డీఏ బకాయిల విడుదలతో పాటు 71 సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ , ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మొదటి రోజు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ రీతిలో పోరాటాన్ని అందరూ స్వాగతిస్తారు.
కానీ ఉద్యోగుల సమస్యల సాకుతో సొంత రాజకీయ ఎజెండాను అమలు చేయాలనే కుట్రలే ఉద్యోగులకు శాపంగా మారాయి. 13 లక్షల ఉద్యోగులు ఉన్నారని, తమవి 60 లక్షల ఓట్లు ఉన్నాయని, తాము తలచుకుంటే ప్రభుత్వాల్ని కూలగొడుతామని ఉద్యోగ సంఘం నాయకుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. తాను రాస్తేనో, చూపుతేనో జనానికి ఏమీ తెలియదని మీడియా ఏ విధంగా భ్రమ పడుతుంటుంటో, తాము లేనిది సమాజం మనుగడ సాగించలేదని బండి శ్రీనివాసరావు లాంటి నాయకులు కలలు కంటూ వుంటారు.
అందుకే అలాంటి వాళ్ల నుంచి ఇలాంటి అభ్యంతరకర హెచ్చరికలు. సమాజం అంటే తామే కాదని, ఇంకా పెద్ద ప్రపంచం ఉందని గుర్తిస్తే… అంతా మంచిగా జరుగుతుంది. అలా కాకుండా మిగిలిన వర్గాలను విస్మరించడం వల్లే… ఉద్యోగులు, మీడియా ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంటున్నారు. ఇది పచ్చి నిజం. కావున ఇప్పటికైనా నేలవిడిచి హెచ్చరికలు చేయడం మానితే మంచిది.