టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేదు. వైసీపీ ఎటూ తన ప్రధాన ప్రత్యర్థి కావడంతో, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాల్లేవు. ఇక మిగిలింది ప్రజాశాంతి పార్టీ ఒక్కటే. టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్…ఇలా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.
2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొంది. బీజేపీ-టీడీపీ కూటమికి జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు పలికారు. ఆ రెండు పార్టీల గెలుపు కోసం విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమి ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశస్థాయిలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మూడున్నరేళ్లకు ఆ రెండు పార్టీలతో పవన్‌కల్యాణ్ విడిపోయాడు. ఆ తర్వాత ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా బీజేపీ -టీడీపీ మధ్య విభేధాలు పొడచూపడంతో, తెగదెంపులు చేసుకున్నాయి.
2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ ఒంటరిగానూ, వామపక్షాలు, బీఎస్పీతో జనసేనాని పవన్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో తలపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి 151 సీట్లను దక్కించుకొంది. టీడీపీ 23, జనసేన ఒక్కటంటే ఒక్కస్థానంతో సరిపెట్టుకొంది. ఎన్నికల అనంతరం ఇటీవల వామపక్షాలతో జనసేన విడిపోయింది. బీజేపీతో పవన్ పార్టీ పొత్తు పెట్టుకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి.
ఇక టీడీపీతో సీపీఐ గత కొంతకాలంగా అంటకాగుతోంది. ఒక శాతానికి లోపు ఓటు బ్యాంకు ఉన్న సీపీఐతో టీడీపీ పొత్తు కుదుర్చుకునేందుకు గురువారం చర్చలు జరిపారు. ఆ రెండు పార్టీల చర్చలు, గత కొంత కాలంగా చెట్టపట్టాలేసుకున్న తిరుగుతుండటాన్ని చూస్తే…సీపీఐ బలపడిందా లేక టీడీపీ ఆ పార్టీ స్థాయికి దిగజారిందా అనే అనుమానాలు తెలుగు తమ్ముళ్లలో మెదలుతున్నాయి.
భవిష్యత్‌లో తమ నాయకుడు ప్రజాశాంతి పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకునేట్టు ఉన్నాడని టీడీపీ కార్యకర్తలు వ్యంగ్యంగా అంటున్నారు. త్వరలో కేఏ పాల్‌తో పొత్తు విషయమై చంద్రబాబు చర్చించే అవకాశాలు లేకపోలేదని తెలుగు తమ్ముళ్లు నిర్వేదంతో అంటున్నారు. ప్రజల తిరస్కరణకు గురైన సీపీఐతో పొత్తు పెట్టుకోవడం ఏంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అలాంటి పార్టీతో కలసి ఎన్నికలకు వెళితే…ఉన్న కార్యకర్తలు కూడా చేజారే ప్రమాదం లేకపోలేదని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్టియన్ల ఓట్ల కోసం కేఏ పాల్‌తో కూడా పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని తెలుగు తమ్ముళ్లు వెటకారంగా అంటున్నారు. 2024 ఎన్నికల నాటికి ప్రజాశాంతి పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలతో కలసి పోటీ చేసిన పార్టీగా టీడీపీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు బాబుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.