“పవన్ కల్యాణ్ కి నీతి నిజాయితీ లేవు, కట్టుబాట్లు లేవు, అందుకే పెద్ద పెద్ద వాళ్లంతా ఆయన్ను, ఆయన పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే కాకముందే ఏడాదికో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న పవన్, ఇక ఎమ్మెల్యే అయితే ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోండి. అందుకే పవన్ కల్యాణ్ ని నమ్మకండి.”
ఇవీ పవర్ స్టార్ ని ఉద్దేశించి కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు. కేఏపాల్ ని రాజకీయాల్లో పెద్ద జోకర్ గా భావించవచ్చు కానీ.. ఎప్పుడూ ఆయన ఇతరులపై ఇంత కఠినంగా మాట్లాడలేదు. ఈసారెందుకో పవన్ కల్యాణ్ పై ఆయనకు కోపం తన్నుకొచ్చింది. పవన్ అంటే నాకెంతో గౌరవం అంటూనే.. నా తమ్ముడు అంటూనే చెడామడా తిట్టేశారు.
బీజేపీ యూజ్ అండ్ త్రో పార్టీ అని తెలిసినా కూడా పవన్ కల్యాణ్ వారినే నమ్మి వారితో వెళ్తున్నారంటే ఆయన ఇంతకంటే దిగజారిన స్థితికి వెళ్తారని తాను అనుకోవడం లేదని అన్నారు పాల్. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలసి పనిచేసి 2019 వచ్చేనాటికి బీజేపీని తిడుతూ, మాయావతి కాళ్లు పట్టుకుని, కమ్యూనిష్టులతో చెట్టపట్టాలు వేసుకుని పవన్ తిరిగారని గుర్తు చేశారు. కారణం లేకుండానే ఇప్పుడు కమ్యూనిస్ట్ లను వదిలేసి మళ్లీ అధికార దాహంతో బీజేపీ పంచన చేరారని అన్నారు పాల్.
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ ఓట్లు పాతిక శాతం దాకా ఉన్నా కూడా కనీసం 2 శాతం ఓట్లు కూడా పవన్ కల్యాణ్ కి పడలేదని, జీవితంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరని శాపనార్థాలు పెట్టారు. డ్యాన్స్ లు వేసుకుంటూ సినిమాల్లోకి పో అంటూ ఉచిత సలహా పారేశారు.
ఉలుకూ పలుకూ లేకుండా ఫేస్ బుల్ లైవ్ ద్వారా రాష్ట్ర రాజకీయాలు, కరోనాపై స్పందించడం కేఏపాల్ కి అలవాటు. తిట్టుకుంటున్నా సరే ఆయన లైవ్ లో చెప్పే విషయాలను సరదాగా వింటుంటారు నెటిజన్లు. చంద్రబాబు జూమ్ లైవ్ కంటే ఎక్కువమంది నిన్న కేఏపాల్ లైవ్ నే ఆసక్తిగా చూశారంటే పాల్ కామెడీని ఎంతమంది ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఊహించని విధంగా ప్రత్యక్షంగా పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ విమర్శల దాడి చేసే సరికి జనసైనికులు సోషల్ మీడియాలో అతడ్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.