వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై అధ్యయనం చేయాలంటూ అహ్మదాబాద్ ఐఐఎంకు తెలుగుదేశం నేత కళా వెంకట్రావు లేఖ రాశారట! జగన్ పై ముప్పై ఒక్క కేసులు ఉన్నాయని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్ల రూపాయలను సంపాదించారని.. ఈ అంశంపై అధ్యయనం చేయాలని కళా వెంకట్రావు కోరారట. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారట!
చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ కోర్టుకు ఎక్కింది. సీబీఐ విచారణను కోరింది. తొమ్మిదేళ్లుగా సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. జగన్ అవినీతి గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ రెండు సార్లు ఎన్నికలకు వెళ్లింది. ఒక్కసారి తృటిలో బీజేపీ సాయంతో అధికారాన్ని సంపాదించుకుంది. రెండోసారి.. కూడా జగన్ అవినీతే అజెండా ఎన్నికలకు వెళ్లి చిత్తు చిత్తుగా ఓడింది.
ఇప్పుడు అధ్యయనం చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకే ఎందుకు పరిమితం అయ్యేందనేది తెలుగుదేశం తెలుసుకోవాల్సిన అంశం. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొన్న పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకే పరిమితం కావడం గురించి తెలుగుదేశం పార్టీ అధ్యయనం చేయించుకోవాలి!
అన్ని కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎందుకు తగ్గిపోయిందో ఏ సంస్థకు అయినా కాంట్రాక్టు ఇచ్చి తెలుగుదేశం పార్టీ పరిశోధించుకోవాలి. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఎందుకు రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడో తేల్చుకోవాలి! ఈ అంశాలన్నింటి మీదా తెలుగుదేశం పార్టీ అధ్యయనం చేయించుకుంటే ఆ పార్టీకే మంచిది.
అలా కాకుండా… ఇంకా జగన్ మీద పదేళ్ల కిందటి ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కామెడీ చేస్తూ ఉంది. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదేళ్ల నుంచి చెబుతూ ఉన్నారు. ప్రజలేమో అదే జగన్ నే మళ్లీ సీఎంగా చేశారు కదా. తెలుగుదేశం పార్టీకి వర్తమానంలో మాట్లాడటానికి ఏమీ లేక.. పాడిందే పాడుతూ పాచి కంపు కొట్టిస్తూ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.