సీమ ఆడ‌బిడ్డ‌ను ఆద‌రించిన కోస్తా ప్రాంతం

రాయ‌లసీమ ఆడ‌బిడ్డ‌ను కోస్తా ప్రాంతం ఆప్యాయ‌త‌తో ఆద‌రించింది. విజ‌యంతో ఆలింగ‌నం చేసుకుని త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో మూడు ప్రాంతాలుగా స‌మాజం విడిపోయింద‌నే వాద‌న‌లో ప‌స‌లేద‌ని  తేలిపోయింది. మూడు రాజ‌ధానుల…

రాయ‌లసీమ ఆడ‌బిడ్డ‌ను కోస్తా ప్రాంతం ఆప్యాయ‌త‌తో ఆద‌రించింది. విజ‌యంతో ఆలింగ‌నం చేసుకుని త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో మూడు ప్రాంతాలుగా స‌మాజం విడిపోయింద‌నే వాద‌న‌లో ప‌స‌లేద‌ని  తేలిపోయింది. మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంతో త‌లెత్తిన గొడ‌వ‌లు, విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్యే త‌ప్ప‌, ప్ర‌జ‌ల మధ్య చిచ్చు పెట్ట‌లేక‌పోయాయ‌ని కృష్ణా -గుంటూరు నియోజ‌క‌వ‌ర్గ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫ‌లితం మ‌రోసారి తేల్చి చెప్పింది.  

గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం నుంచి త‌మ‌టం క‌ల్ప‌ల‌త విజ‌యం సాధించారు. ఈ విజ‌యం ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే క‌ల్ప‌ల‌త స్థానికేతురాలు. అందులోనూ రాయ‌ల‌సీమ ఆడ‌బిడ్డ‌. అలాంటిది రాజ‌కీయ చైత‌న్యానికి మారుపేరైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఉపాధ్యాయులు ఆద‌రించ‌డం మామూలు విష‌యం కాదు. 

క‌ల్పల‌త సాధించిన విజ‌యం కంటే, ఆమె విజ‌య సౌధానికి ఓట్లెత్తిన ఉపాధ్యాయులు అంత‌కంటే గొప్ప‌వాళ్లు. ఎందుకంటే క‌ల్ప‌ల‌త త‌మ ప్రాంతం కాద‌నో, త‌మ కులం కాద‌నో తిర‌స్క‌రించ‌ని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల సంస్కారం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్ట‌ర్ ప్ర‌తాప్‌రెడ్డి స‌తీమ‌ణే క‌ల్ప‌ల‌త‌. అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌లుపుల మండ‌లం బండ్ల‌ప‌ల్లె స్వ‌స్థ‌లం. క‌ల్ప‌ల‌తది రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి గ‌తంలో టీడీపీ హ‌యాంలో అనంత‌పురం జెడ్పీ వైస్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. క‌నీసం ఉపాధ్యాయురాలు కూడా కాని క‌ల్ప‌ల‌త‌ను ఉపాధ్యాయులు త‌మ ప్ర‌తినిధిగా ఎన్నుకోవ‌డం గ‌మ‌నార్హం.

క‌ల్ప‌ల‌త గృహిణి. ఏ ఉపాధ్యాయ సంఘంతోనూ ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేదు. ఆమె స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగారు. మ‌రోవైపు యూటీఎఫ్ త‌ర‌పున బొడ్డు నాగేశ్వ‌ర‌రావు,  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏఎస్ రామ‌కృష్ణ , ఎస్టీయూ నుంచి పి.మ‌ల్లిఖార్జున‌రావు త‌దిత‌రులు బ‌ల‌మైన అభ్య‌ర్థులు నిలిచిన స్థానం నుంచి ఆమె అనామ‌కురాలిగా  రంగంలోకి వ‌చ్చారు.  

నాన్ లోక‌ల్‌, నాన్ టీచ‌ర్ అంటూ ప్ర‌త్య‌ర్థులు ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పించారు. నైతికంగా ఆమెను దెబ్బ తీసేందుకు అనేక అంశాల్ని ప్ర‌త్య‌ర్థులు తెర‌పైకి తెచ్చారు. మ‌రోవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏఎస్ రామ‌కృష్ణ‌కు టీడీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అలాగే బొడ్డు నాగేశ్వ‌ర‌రావుకు బ‌ల‌మైన యూనియ‌న్ మ‌ద్ద‌తుతో పాటు క‌మ్మ సామాజిక వ‌ర్గం క‌లిసి వ‌స్తాయ‌ని అంద‌రూ భావించారు. ప్ర‌ధాన పోటీ బొడ్డు నాగేశ్వ‌ర‌రావు, రామ‌కృష్ణ మ‌ధ్యే ఉంటుంద‌ని వేసుకున్న అంచ‌నాల‌న్నింటిని త‌ల‌కిందులు చేస్తూ క‌ల్ప‌ల‌త గెలుపొందారు.

కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, యూనియ‌న్ల‌కు అతీతంగా ఆద‌రించార‌ని ఆమె విజ‌య‌మే చెబుతోంది. క‌ల్ప‌త‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌నే కార‌ణంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఎస్టీయూకు చెందిన 15 మంది నాయ‌కుల‌ను స‌స్పెండ్ చేశారంటే…. ఏ ర‌కంగా మ‌ద్ద‌తు ల‌భించిందో అర్థం చేసుకోవ‌చ్చు. మొద‌ట్లో క‌ల్ప‌ల‌త‌కు పండిత ప‌రిష‌త్‌, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, వైఎస్సార్ టీఎఫ్‌, పీఆర్‌టీయూలో ఒక వ‌ర్గం మాత్ర‌మే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఓట్ల‌కు వ‌చ్చేస‌రికి యూనియ‌న్ల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించి ఆద‌రించ‌డం వ‌ల్లే ఆమె చ‌రిత్ర సృష్టించారు.

ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. అలాంటి చోట ఇత‌ర సామాజిక వ‌ర్గానికి చెందిన వారు రాజ‌కీయంగా రాణించ‌డం ఆషామాషీ కాదు. రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌రుస‌గా రెండో సారి  గుంటూరు పార్ల‌మెంట్ నుంచి గెలుపొందారంటే… అది ఆయ‌న సామాజిక వ‌ర్గ బ‌ల‌మే త‌ప్ప మ‌రొక‌టి కాదు.

ఇప్పుడు అనంతపురం ఆడ‌బిడ్డ గెలుపొందారంటే … నిజంగా ఇది ముమ్మాటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయులు, ఇత‌ర‌త్రా ప్ర‌జానీకం మంచిత‌నం సాధించిన విజ‌యంగా రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర స‌మాజం అభివ‌ర్ణిస్తోంది. ఇదే సంద‌ర్భంలో త‌నకు జ‌న్మ‌నిచ్చిన  ప్రాంతం గౌర‌వాన్ని నిలిపేలా  ఉపాధ్యాయుల‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి  క‌ల్ప‌ల‌త కృషి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని రాయ‌ల‌సీమ స‌మాజం ఆకాంక్షిస్తోంది.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్