ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా, సామాజికంగా క్రమంగా ఏకాకి అవుతోంది. దీనికి ఆ సామాజిక వర్గంలో ఉన్నత స్థానంలో ఉన్న కొంత మంది అత్యుత్సాహమే కారణమని చెప్పొచ్చు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అనైతిక విధానాలు కూడా తోడయ్యాయి.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు గట్టి మద్దతుదారులుగా నిలిచారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ఆయా సామాజిక వర్గాలు టీడీపీ అంటే తమ పార్టీ అనే భావనలో ఉండేవి. ఎప్పుడైతే టీడీపీని చంద్రబాబు లాక్కున్నారో…నాటి నుంచి పార్టీలో ప్రాధాన్యాలు మారిపోయాయి.
నడిరోడ్డుపై తోకలు కత్తెరిస్తానని నాయీ బ్రాహ్మణులను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నోరు జారిన రోజే…బాబు అధికార తోకను కత్తెరించేందుకు బీసీలు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బాబు ఘోర పరాజయం చెందడానికి బీసీలు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ప్రస్తుతానికి వస్తే….మూడురోజులుగా ఏపీలో జస్టిస్ ఈశ్వరయ్యను బాబు సామాజిక వర్గం తన మీడియా అండతో టార్గెట్ చేయడం బీసీల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. తమ అండతో ఎక్కువ కాలం అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు, ఆయన సామా జిక వర్గం గతమంతా మరిచిపోయి…ఇప్పుడు తమ ఉనికినే లేకుండా చేయాలనే ప్రయత్నాలపై బీసీలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
చివరికి సస్పెండ్ అయిన రామకృష్ణతో తన ఫోన్ సంభాషణపై వివరణ ఇచ్చేందుకు వస్తే…అక్కడ కూడా మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన గొంతు అణగదొక్కాలనే ప్రయత్నాలను బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలంటే టీడీపీ లేదా కమ్మ సామాజిక వర్గ పల్లకీలు మోసే బోయీల మాదిరిగా భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి రాజకీయంగా, సామాజికంగా అండగా నిలిచినంత కాలం బీసీలు మంచి వాళ్లగా కనిపించారా? ఏ మాత్రం సొంత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉన్నాయని ప్రవర్తిస్తే అథంపాతాళానికి తొక్కాలని చూస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
వెనుకబడిన కులంలో పుట్టి, అనేక అవరోధాలను ఎదుర్కొని హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి జస్టిస్ ఈశ్వరయ్య ఎదిగారని గుర్తు చేస్తున్నారు. అణగారిన వర్గాల వారు ఆ స్థాయికి ఎదగాలంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక అడ్డంకులపై యుద్ధం చేయాల్సి ఉంటుందంటున్నారు. అలాంటి ఈశ్వరయ్య ఏపీ సర్కార్‌లో ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ పదవిని దక్కించుకోవడాన్ని టీడీపీ, ఎల్లో మీడియా జీర్ణించుకోలేక పోతున్నాయని బీసీలు వాపోతున్నారు.
రామకృష్ణతో జరిపిన సంభాషణలో ఓ తండ్రిలా ఈశ్వరయ్య మాట్లాడడాన్ని గమనించవచ్చంటున్నారు. 2007, 08, 09లో తాను మూడు బ్యాచ్‌లు సెలెక్ట్ చేసానని, ఎస్సీలని కూడా ఓపెన్‌గా సెలెక్ట్ చేశానని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను మన వాళ్లను 75 పర్సెంట్ సెలెక్ట్ చేశానని, దాదాపు 200 మందిని మేజిస్ట్రేట్‌లను చేశానని,. ఇప్పుడున్న జడ్జిలందరూ అప్పుడు తాను సెలెక్ట్ చేసిన వాళ్లేనని చెప్పడాన్ని బట్టి జస్టిస్ ఈశ్వరయ్యలో అణగారిన వర్గాలపై ఉన్న ప్రేమాభిమానాలను అర్థం చేసుకోవచ్చంటున్నారు.
అణగారిన వర్గాలకు అండగా నిలిచేందుకే ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ను ఈశ్వరయ్య స్థాపించాడంటున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాను బీసీ వ్యక్తినని, తనలోని ప్రతి శ్వాసలో బీసీ భావజాలమే ఉంటుందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా రామకృష్ణతో జరిపిన సంభాషణలో వైఎస్ జగన్‌పై బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మరింత నమ్మకం కుదిరే, వైసీపీకి మరింత చేరువయ్యేలా ఈశ్వరయ్య మాటలుండడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతున్నది.
“నాగార్జున రెడ్డికి జగన్మోహన రెడ్డి బంధువైనా సరే… ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అండగా ఉండాలి. నాగార్జున రెడ్డి మాటలు సీఎం వినడు” అని ఈశ్వరయ్య తేల్చి చెప్పారు. దీన్ని బట్టి జగన్ తన సామాజిక వర్గం కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అగ్రస్థానం కల్పిస్తారని జస్టిస్ ఈశ్వరయ్య సర్టిఫికెట్ ఇచ్చినట్టైంది. ఈశ్వరయ్య మాటలకు తోడు ఇప్పటికే ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు, తన కేబినెట్‌లో కీలక పోస్టులు ఇవ్వడం కూడా జగన్‌పై ఆయా సామాజిక వర్గాల్లో మరింత పరపతి పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తన సామాజిక వర్గం, కులం కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలే జగన్‌కు ముఖ్యమని ఈశ్వరయ్య చెప్పడం ద్వారా…వైఎస్ జగన్ కోసం దేనికైనా నిలబడాలనే ఆత్మీయ భావన ఆయా సామాజిక వర్గాల్లో తప్పక కలిగిస్తాయి.
ఇదిలా ఉండగా జస్టిస్ ఈశ్వరయ్యపై ఎంత ఎక్కువ చేస్తే…అంతగా టీడీపీ పతనానికి మార్గం సుగుమం అయినట్టే. గతంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా ఇదే రీతిలో మీడియాను అడ్డుపెట్టుకుని ఓవర్ యాక్షన్ చేయడం వల్లే కాపులు దూరమ య్యారు. హైదరాబాద్‌లో ఒక హోటల్‌లో జనసేన మీటింగ్ పెట్టుకుంటే…రాష్ట్రం కోసం చానల్ మారానని చెప్పుకుంటున్న ఓ జర్నలిస్టు స్టింగ్ ఆపరేషన్ చేసి…పెద్ద ఎత్తున డబ్బు కలెక్ట్ చేస్తున్నాడంటూ గంటల తరబడి డిబేట్ పెట్టడాన్ని చూశాం. అలాగే కత్తి మహేశ్‌ను అడ్డుపెట్టుకుని పవన్‌కల్యాణ్‌ను ఎంతగా బజారు కీడ్చారో కాపులు ఎప్పటికీ మరిచిపోరు. తమను కాదన్న ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మీడియా ముసుగులు టీడీపీ ఆడుతున్న వికృత ఆట…చివరికి తన ఉసురు తీస్తుందనే వాస్తవాన్ని గ్రహించేలా లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా ఒంటరి వాడయ్యారు. ఆయన్ను ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు లాగే ఆయన సామాజిక వర్గం కూడా క్రమంగా రాజకీయంగా, సామాజికంగా ఒంటరి అవుతోంది. బాబు, ఆయనకు కొమ్ము కాసే కుల మీడియా కారణంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఏపీ సమాజం కరోనాను చూసినట్టు చూస్తోంది. నిన్న పవన్ కల్యాణ్, నేడు జస్టిస్ ఈశ్వరయ్య…రేపు మనమే ఎందుకు కాకూడదనే ప్రశ్న, అనుమానం ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది.
కమ్మ సామాజిక వర్గంలోని కొందరి అత్యుత్సాహం వల్ల…మొత్తం ఆ సామాజిక వర్గాన్నే నమ్మలేని దుస్థితి ఏర్పడింది. నిజానికి ఇలాంటి పరిణామాలు మంచివి కావు. కానీ చంద్రబాబు, లోకేశ్ పుణ్యమా అని మొత్తం సామాజిక వర్గానికే చేటు తెస్తోంది. జస్టిస్ ఈశ్వరయ్యకు ఫోన్ చేయించి, ఇరికించాలనే టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నాలను చూపుతూ….తడిగుడ్డలతో గొంతులు కోయడానికి కూడా వారు వెనుకాడరని బలమైన అభిప్రాయానికి రావడం విచారకరం. చంద్రబాబు, లోకేశ్‌బాబు, మీడియా అధిపతులు శాశ్వతం కాదు. కానీ వారి చేష్టలు సమాజంపై ఏర్పరిచే ముద్రలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఇప్పుడిదే కమ్మ సామాజిక వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.