రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టొచ్చు.. ప్రజల్లోకి రావొచ్చు, కానీ ఏపీలో ఏ పార్టీ ప్రజల ముందుకొచ్చినా, ఎంతటి మహామహులు ఎన్నికలకు వచ్చినా జగన్ ఉన్నంత వరకు ఆయనదే గెలుపని అన్నారు వైసీపీ నాయకులు, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి. అయితే ఆయన దీనికి ఓ లాజిక్ కూడా చెప్పుకొచ్చారు.
ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన, బీజేపీ.. వచ్చే దఫా ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయం అవుతాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సవివరంగా స్పందించారు. జగన్ లాంటి నాయకుల వల్ల కలిగిన మేలుని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని, ఆయన చేసిన, చేస్తున్న, చేయబోయే మంచి పనులే మరోసారి ఆయన్ను అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పారు పోసాని. అదే సమయంలో పవన్ కల్యాణ్ బీజేపీతో కలసి పోటీ చేసినా, ఎన్నికల నాటికి వీరితో చంద్రబాబు కలసినా పెద్ద ప్రయోజనం ఏదీ లేదని ఢంకా భజాయించారు.
ప్రజలెప్పుడూ నాయకులను పోల్చి చూస్తారని, పార్టీలు, వ్యక్తుల గతచరిత్ర కూడా తరచి చూస్తారని, సమర్థులనే ఎన్నుకుంటారని అన్నారు పోసాని. జనసేన, బీజేపీ, టీడీపీ ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. ఇక జీవితంలో ఎవరూ ఆ పార్టీలకు ఓట్లు వేయరని తేల్చేశారు. పవన్ కల్యాణ్ కి అంత సీన్ లేదని, బాబు కుట్రలు ఈసారి కూడా ఫలించబోవని జోస్యం చెప్పారు.
గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున బలంగా తన వాణి వినిపించిన పోసాని, ఎన్నికల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. వైసీపీ తరపున మాట్లాడేందుకు, జగన్ ని సమర్థించేందుకు కూడా ఆయన ముందుకు రావడంలేదు. దీనికి కూడా ఆయన ఓ కారణం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎవరు ఏం మాట్లాడినా దానిపై లీగల్ గా వెళ్తున్నారని, కేసులు వేస్తున్నారని.. అందుకే తాను కాస్త వెనక్కు తగ్గానని అంటున్నారు. ప్రస్తుతం అన్ని అంశాలను, అభివృద్ధిని.. కోర్టుల్లో సవాల్ చేస్తున్నారని, అందుకే తన అభిప్రాయాలు చెప్పలేకపోతున్నానని అన్నారు.
మొత్తమ్మీద ఒక విషయంపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన, టీడీపీ కచ్చితంగా కలుస్తాయని అయినా కూడా జగన్ ని వారు ఏమీ చేయలేరని జోస్యం చెప్పారు.