విశాఖ రాజధానిగా నిర్ణయించిన తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విశాఖను ఎలా రాజధానిగా నిర్ణయిస్తారంటూ అనుకూల మీడియాతో తప్పుడు రాతలు రాయించింది టీడీపీ. బంగాళాఖాతంలో భౌగోళిక చీలికలున్నాయని, దాన్ని కూడా విశాఖతో లింకు పెట్టి ఆమధ్య 'ఈనాడు' ఏకంగా బ్యానర్ కట్టింది. ఇక జ్యోతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడా బాధ్యత బాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా తీసుకున్నట్టు అనిపిస్తోంది.
గాజువాకలో ఓడిపోయినప్పుడే విశాఖపై ఓ రకమైన వైఖరిని పెంచుకున్న పవన్ కల్యాణ్.. తాజాగా మరోసారి విశాఖపై తనకున్న అక్కసునంతా బయటపెట్టారు. బీరుట్ పేలుళ్లను ఉదహరిస్తూ విశాఖ గుండెలమీద నిప్పుల కుంపటి ఉందని తేల్చేశారు పవన్. విదేశాల నుంచి కేవలం విశాఖ పోర్ట్ కే అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే అనుమతి ఉందని, అందుకే అమ్మోనియం నైట్రేట్ నిల్వలు మన దేశంలో ఎక్కువగా విశాఖలోనే ఉన్నాయని ఇది అత్యంత ప్రమాదకర స్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మోనియం నైట్రేట్ ప్రమాదకర రసాయనమే కానీ ఉష్ణోగ్రత 270 డిగ్రీలు దాటితేనే దానితో ముప్పు, ఈ విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు కానీ.. ఎందుకైనా మంచిది విశాఖ సంగతి చూడండి అంటున్నారు. ఇటీవల వరుసగా విశాఖ రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై దృష్టి సారించాలని చెప్పారు పవన్ కల్యాణ్.
అయితే అసలు ప్రత్యామ్నాయం ఏంటో పవన్ సూచించలేకపోయారు. సరైన రక్షణ చర్యలు చేపట్టండి, రసాయనాన్ని వికేంద్రీకరణ చేసి వేర్వేరు చోట్ల నిల్వచేయండి అని సలహా ఇచ్చారు కానీ, అది ప్రమాదం అని తేలిన తర్వాత ఇంకెవరైనా తమ ప్రాంతంలో దాన్ని ఎందుకు నిల్వ చేయడానికి అనుమతిస్తారు. పోనీ అనుమతిచ్చినా, అక్కడ ప్రమాదం జరిగితే అప్పుడు ఏంచేస్తారు. ప్రమాదం విశాఖలో జరిగినా నష్టమే, ఇంకో చోట జరిగినా కష్టమే.
అమ్మోనియం నైట్రేట్ ప్రమాదకరమే కానీ గతంలో ఎప్పుడూ బీరుట్ లాంటి ఉదంతాలు జరగలేదు. అసలు బీరుట్ ప్రమాదం జరిగే వరకు విశాఖలో దాని నిల్వలు ఉన్నట్టు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పటికిప్పుడు పవన్ విశాఖపై నిప్పుల కుంపటి అనే నింద వేయడం దేనికి సంకేతం.
మూడు రాజధానులపై ఇంత విషం కక్కాలనుకున్నప్పుడు దానికి బీరుట్ ఉదంతాన్ని అడ్డం పెట్టుకోవడం ఎందుకు? నేరుగా చెప్పేస్తే పోతుంది కదా.. ?