ముద్రగడ పద్మనాభం…తెలుగు సమాజంలో రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. అసలు తాను అలా పిలిపించుకోవడమే ఆయన గౌరవంగా భావించేవారు. ఆర్థికంగా వెనుకబడిన తమ కాపు జాతికి రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై ఆయన అలుపెరగడని పోరాటం చేశారు.
ఇప్పుడు ఆయన స్థానాన్ని అగ్రహీరో పవన్‌కల్యాణ్ భర్తీ చేసేందుకు తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక మీదట జనసేనానిగా కంటే కాపు సేనానిగానే గుర్తింపు పొందేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నట్టు రెండు రోజులుగా ఆయన ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. అందరి వాడినంటూ ప్రారంభించిన ఆయన రాజకీయ ప్రస్థానం కొందరి వాడిగా మారేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అసలే ప్రజల్లో అంతంత మాత్రంగానే బలం ఉన్న జనసేనాని…తాజా నిర్ణయంతో మరింత బలహీన పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం కలగకుండా గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లను తక్షణమే పునరుద్ధరిం చాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాజా పవన్ ప్రకటనతో చంద్రబాబు కోసం తనను రాజకీయంగా బలి తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు తాను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత జగన్ విస్పష్టంగా ప్రకటించారు. మరిప్పుడు జగన్ సర్కార్‌ను పవన్ 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారో మరి!
‘ కాపులపై ప్రేమతో 13 నెలల్లో 4,770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్న జగన్ రెడ్డి కాపులు కోరుతున్న రిజర్వేషన్లు ఎందుకు పునరుద్ధరించడంలేదు. మమ్మల్ని ఎవరూ ఉద్ధరించనక్కరలేదు. మా ఆత్మాభిమానం దెబ్బతినేలా జాలి చూపన క్కరలేదు. మాకు గతంలో ఉన్న రిజర్వేషన్‌ని పునరుద్ధరించమనే అడుగుతున్నాం.. అని అంటున్న కాపులకు జగన్ ఏం సమాధానం చెబుతారు’ అని తన ప్రకటనలో ప్రశ్నించడాన్ని బట్టి…ఆయన నిజ స్వరూపం బయట పడింది. అలాగే నిన్నటికి నిన్న కాపులకు చేసిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ సర్కార్‌ను పవన్ డిమాండ్ చేశారు.
కాపులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తూ…ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా జగన్ సర్కార్ ఆ సామాజిక వర్గం నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఎలాగైనా కాపుల్లో జగన్ సర్కార్‌ను విలన్‌గా నిలబెట్టాలనే కుట్రలో భాగమే పవన్ తాజా ప్రకటనగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి అండగా నిలిచేందుకు మోడీ సర్కార్ ఈడబ్ల్యుఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. తన రాజకీయ స్వార్థంతో చంద్రబాబు కాపులను మభ్య పెట్టేందుకు…ఆ కోటాలో 5 శాతం కాపులకు ఇస్తున్నట్టు నాటకాలాడారు. ఆ తర్వాత జగన్ సర్కార్ దాన్ని రద్దు చేసి అగ్రవర్ణాల వారికి కేంద్రం కేటాయించిన పది శాతం రిజర్వేషన్‌ను తిరిగి పునరుద్ధరించింది. ఇది అసలు వాస్తవం.
కానీ కాపుల ఐదు శాతం రిజర్వేషన్‌ను జగన్ సర్కార్ రద్దు చేసిందనే భావన తన సామాజిక వర్గంలో నింపి వ్యతిరేకత పెంచాలని పవన్ తహతహలాడడం చూస్తుంటే జాలి వేస్తోంది. తాను కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయడంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు పోరాడడం లేదు? ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను ఎందుకు రంగంలోకి దించినట్టు? లాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఐదు శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని కోరితే… ఇటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోనూ, అటూ కాపేతర కులాల్లోనూ తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుందనే భయంతో నోటికి తాళాలు వేసుకున్నారు. దీంతో ఎప్పట్లాగే తమ అస్త్రం పవన్‌ను రంగంలోకి దింపారు. ఎటూ పవన్ కాపు కులస్తుడు కాబట్టి, ఆయనతోనే మాట్లాడిస్తే నష్టపోయేది ఏమీ ఉండదని టీడీపీ అంతరంగంగా చెబుతున్నారు.
ఇక పవన్ రాజకీయాల విషయానికి వస్తే …ఎటూ ఆయనకు అంతోఇంతో కాపుల ఓట్లు తప్ప మిగిలిన సామాజిక వర్గాల నుంచి పెద్దగా ఆదరణ లేదనేది టీడీపీ అభిప్రాయం. అందులోనూ టీడీపీ ఆదేశిస్తే..తనను తాను కోల్పోవడానికి కూడా వెనుదీయని నైజం పవన్‌ది. మరోవైపు జనసేన మిత్రపక్షం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కాపు నాయకుడు కన్నా లక్ష్మినారాయణ మాత్రం ఈడబ్ల్యుఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని ఇటీవల జగన్ సర్కార్‌కు లేఖ రాయడం గమనార్హం.
జగన్ సర్కార్ అంటే ఒంటి కాలుపై లేస్తున్న పవన్…మోడీ సర్కార్ విషయానికి వచ్చే సరికి అన్నీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడ్డం ఆశ్చర్యం కలుగుతోంది.
‘ కాపుల స్థితిగతులను అంచనా వేయడానికి మంజునాథ కమిషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ నివేదిక మేరకు కాపులను బీసీ జాబితాలోని ‘ఎఫ్‘ కేటగిరిలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ, మండలిలో బిల్లును ఆమోదించారు. తదుపరి బిల్లును కేంద్రానికి పంపారు. ఇది పార్లమెంటులో అనుమతి పొంది చట్టంగా మారడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రం దేశమంతటిని దృష్టిలో పెట్టుకునే ఆలోచన చేస్తుంది. దీంతో కాలాతీతం అయిపోయింది’ అని పవన్ పేర్కొన్నారు.
తన మిత్ర పక్ష పార్టీ కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తోంది. అలాంటప్పుడు తన సామాజిక వర్గం కోసం మోడీ సర్కార్‌పై ఆ మాత్రం ఒత్తిడి చేసే దమ్ము, ధైర్యం పవన్‌కు లేవా? పార్లమెంట్‌లో అనుమతి పొంది చట్టంగా మారండం ఆషామాషీ వ్యవహారం కాదని కేంద్రం తరపున సంజాయిషీ ఇచ్చుకోవడంలోని చిత్తశుద్ధి ఏంటో కాపులు అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నారని పవన్ భ్రమిస్తున్నారు. మంజునాథ కమిషన్‌కు , బిల్లులకు కాలాతీతం కావడం ఏంటి? తన దగ్గరికి వచ్చే సరికి మాత్రం పవన్ సాకులు వెతుక్కోవడం ఆయన ప్రకటనలో చూడొచ్చు.
మొత్తానికి చంద్రబాబు ట్రాప్‌లోనే పవన్ ఉన్నారని మరోసారి స్పష్టంగా తెలిసొచ్చింది. పవన్ తాజా రాజకీయాలు మాత్రం ఇక ఆయన్ను కాపు నాయకుడిగానే పరిమితం చేసేలా ఉన్నాయి. బహుశా పవన్ కూడా కాపుల కోసం, అన్నిటికి మించి చంద్రబాబు కోసం పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటన చూస్తే అర్థమవుతోంది. కావున పవన్ ఇక మీదట జనసేనానిగా కాకుండా కాపు సేనానిగా పిలిపించుకుంటారన్న మాట!