కర్ణాటకలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి వాయిదాల మీద వెళ్తోంది సంకీర్ణ సర్కారు. విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టినట్టే పెట్టి దానిపై ఓటింగ్ మాత్రం జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గురువారమే విశ్వాస తీర్మానం అని ప్రకటించారు.
అయితే ఆ రోజు ఓటింగ్ నిర్వహించలేదు. విశ్వాస తీర్మానం పై మరింత చర్చ జరగాలంటూ శుక్రవారానికి వ్యవహారాన్ని సాగదీశారు. అయితే శుక్రవారం కూడా కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకపోవడం గమనార్హం.
ఈ అంశంపై ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడింది. దీనిపై సీఎల్పీ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. విశ్వాస తీర్మానంపై మరింత చర్చ జరగాల్సి ఉందని, మరింతమంది మాట్లాడాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకో ఇరవై మంది మాట్లాడాల్సి ఉందంటూ చెప్పారు. స్థూలంగా వ్యవహారాన్ని సోమవారానికి లాగారు సంకీర్ణ ప్రభుత్వ నేతలు.
అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాగే గవర్నర్ కూడా రియాక్ట్ కావడం గమనార్హం. ఎటు తిరిగీ శుక్రవారం సాయంత్రానికి బలపరీక్షలో మద్దతును నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి మరోసారి ఆదేశాలు ఇచ్చారు గవర్నర్.
ఇప్పటికే మధ్యాహ్నం ఒకటిన్నర లోగా విశ్వాస పరీక్ష పై ఓటింగ్ జరగాలన్న గవర్నర్ మాటను స్పీకర్ పట్టించుకోలేదు. తాజాగా అందుకు సంబంధించి గవర్నర్ గడువును పొడిగించారు. శుక్రవారం సాయంత్రం ఆరులోగా బలాన్ని నిరూపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.