బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో కూడా వికేంద్రీకరణ బాటే పట్టారు. కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి పలు ముఖ్యమైన కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యడ్యూరప్ప సర్కార్ నిర్ణయం తీసుకొంది. బెంగళూరులోని వివిధ శాఖలకు చెందిన 10 కమిషనర్ కార్యాలయాలను, మండళ్లను తరలించడానికి బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యాలయాలను ఉత్తర కర్నాటకలోని జిల్లాల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా యడ్యూరప్ప ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కర్నాటకలోని బెళగావి, కలబురగి, ధార్వాడ తదితర జిల్లాల్లో కమిషనర్ కార్యాలయాలను, మండళ్లను ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్ప సర్కార్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
జగన్ బాటలో యడ్యూరప్ప సర్కార్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బాటలోనే యడ్యూరప్ప సర్కార్ కూడా నడుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బెళగావిలో సువర్ణ విధాన సౌధను నిర్మించారు. ప్రస్తుతం కమిషనర్ కార్యాలయాలను తరలించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, 2018, డిసెంబర్‌లో అప్పటి సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వం బెంగళూరు నుంచి కొన్ని కమిషనర్ కార్యాలయాలను ఉత్తర కర్నాటకలోని జిల్లాలకు తరలించేందుకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
కుమారస్వామి ప్రభుత్వం పడిపోయి, బీజేపీ సర్కార్ రావడంతో వికేంద్రీకరణ ప్రక్రియ ఆలస్యమైందంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తాజాగా కృష్ణా భాగ్య జలమండలి ఆలమట్టిలో ఏర్పాటు కానుంది. అలాగే దావణగెరెలో కర్నాటక నీరావరి మండలిని ఏర్పాటు చేయనున్నారు.
మానవహక్కుల కమిషన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు ధార్వాడలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని కలుబురిలో నెలకొల్పనున్నారు. మొత్తానికి ఏపీలో జగన్ సర్కార్ తీసుకున్న అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ నిర్ణయం వివాదాస్పదం అయిన నేపథ్యంలో కర్నాటకలో బీజేపీ సర్కార్ ఏకంగా అమలు చేయడం గమనార్హం. ఈ ప్రక్రియపై ఏపీ బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి.