‘భీష్మ’ చిత్రం రాజకీయ వివాదానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ చిత్రానికి మతం రంగు పులుముతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
భీష్ముడి పేరుతో సినిమా విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని , వెంటనే ఆ టైటిల్‌ను మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. హైదర్‌గూడలోని ఎన్ఎఎస్ఎ్సలో బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము, ఇతర సభ్యులు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్ చేశారు.
నితిన్, రష్మిక మందన్నా, వెంకీ కుడుముల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా సోమవారం చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఇదేరోజు ఆ సినిమాపై బీజేపీ వివాదానికి తెరలేపింది. మహాభారతానికి మూల పురుషుడు, ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన భీష్ముడి పేరుతో సినిమా తీయడం ఏంటని బీజేపీ ధార్మిక సెల్ ప్రశ్నిస్తోంది.
ఆ సినిమాలో హీరోను లవర్ బాయ్‌గా చూపిస్తూ ఆ పాత్రకు భీష్మ పేరు పెట్టడం బాధాకరమన్నారు. టైటిల్ మార్చని పక్షంలో ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. సినిమా పేరును మార్చకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సైతం వెనుకాడమని ఈ సందర్భంగా వారు చెప్పారు.