అమలాపాల్…నటన అంటే ప్రాణం. కళను కళగా చూసే గొప్ప గుణం ఆమె సొంతం. ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించిన అమలాపాల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధం లేకుండానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారామె. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాజీ మామ చేసిన ఆరోపణలు మరోసారి అమలాపాల్‌ను వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి.
దర్శకుడు విజయ్ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవడం తెలిసిందే. విజయ్ తిరిగి ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకొని యధావిధిగా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అమలాపాల్ కూడా హీరోయిన్గా బిజీబిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శకుడు విజయ్ తండ్రి, నిర్మాత, నటుడు ఏఎల్.అళగప్పన్ మాట్లాడుతూ….అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణం అని సంచలన ఆరోపణలు చేశాడు.
ఆయన తాను నిర్మించిన ‘అమ్మ కణక్కు’ చిత్రంలో నటించమని అమలాపాల్‌ను కోరాడని తెలిపాడు. అయితే పెళ్లికి ముందు ఇకపై నటించనని చెప్పిన అమలాపాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైందని.. అదే విజయ్‌కు, ఆమెకు మధ్య విడాకులకు దారి తీసిందని చెప్పిన విషయం తెలిసిందే.
మాజీ మామ వ్యాఖ్యలపై ఆమె ఆలస్యంగా స్పందించారు. ‘మీ వివాహ రద్దుకు నటుడు ధనుష్ కారణమనేది వాస్తవమా?’ అనే ప్రశ్నకు … ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు అడుగుతున్నారేంటని ఆశ్చర్యపోతూ ఎదురు ప్రశ్న వేశారు. అయినా తన వివాహ రద్దు గురించి చర్చ అనవసరమన్నారు. అది తన వ్యక్తిగత విషయమని సమాధానమిచ్చారు. విడాకులు తీసుకోవాలన్నది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, అందుకు వేరెవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చారు.
‘అయినా వేరెవరి కారణంగానో వివాహాన్ని రద్దు చేసుకుంటారా?’ అని ప్రశ్నించారామె. నటుడు ధనుష్ తాను బాగుండాలని కోరుకునే వ్యక్తి అని మెచ్చుకున్నారు. ఇంతటితో ఆ విషయానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆమె కోరారు.
‘మీరు మళ్లీ ప్రేమలో పడ్డట్టు ప్రచారం హోరెత్తుతోంది. పెళ్లెప్పుడు చేసుకుంటార’న్న ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘అందుకు ఇంకా సమయం ఉంది. నేను నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి వెల్లడిస్తా’ అని అమలాపాల్ తెలిపారు. దీంతో ఆమె ప్రేమలో ఉన్నారన్న ప్రచారానికి బలం వచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు యాక్షన్ హీరోయిన్గా నటించిన ‘అదో అందపరవై పోల’ చిత్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది. బాలీవుడ్లో మకాం పెట్టడానికి కూడా సిద్ధమవుతోంది. సంచలన దర్శకుడు మహేశ్‌భట్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పర్వీన్ బాబీ’ బయోపిక్‌లో అమలాపాల్ నటించనున్నారు.