తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ శైలాజానాధ్, విజయవాడలో రిజర్వేషన్ లకోసం జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఇద్దరు నాయకులు మాట్లాడిన మాటలను జాగ్రత్తగా గమనించి చూడండి.
గత కొన్ని రోజుల పేపర్లను తిరగేసి ఈ ఇద్దరు నాయకులు ఏమేం మాట్లాడారో గమనించండి. ఇవాళ ప్రసంగాల్లో అసలంటూ కొత్త పాయింటు ఒక్కటైనా ఉన్నదా ఒకసారి చెక్ చేసుకోండి! మరదే… అస్తిత్వ సమస్య.. ఐడెంటిటీ క్రైసిస్ తో కొట్టుకుంటూ… సతమతం అయిపోయే నాయకులు ప్రవర్తించే తీరు.
రాజకీయ నాయకుడు అనేవాడు.. ప్రతిరోజూ వార్తల్లో ఉండాలని.. ప్రజలకు కనిపిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. నాలుగురోజుల పాటూ తను పత్రికల్లో ప్రజలకు కనిపించకపోతే.. ప్రజలు తనను మర్చిపోతారని చాలా మంది భయపడుతూ ఉంటారు.
తమ గురించి చెడుగా అయినా సరే, తమమీద విమర్శలు అయినా సరే.. ప్రతిరోజూ ఏదోఒకటి రాయమని వారు జర్నలిస్టు మిత్రులను అడుగుతూ ఉంటారు. ఇప్పుడలా అడగడం తగ్గిపోయింది గానీ.. ప్రతిరోజూ ప్రజలకు కనిపిస్తూ ఉండడానికి పాట్లు పడడం మాత్రం తగ్గలేదు.
ఆకోవకే చెందుతారు చంద్రబాబునాయుడు గానీ.. శైలాజానాధ్ గానీ! చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన ఇలాగే తపన పడిపోయేవారు. ఇక మాజీ అయిన తర్వాత వేరే చెప్పాలా? సందర్భం కలిసి వస్తే ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి.. ఏమీ లేకపోతే ట్వీట్లు చేసి వాటిని మీడియాకు రిలీజ్ చేయడానికి ఆయన ఉత్సాహపడుతుంటారు. ఏమాత్రం కొత్త విషయం లేకుండా జగన్ మీద పాచిపోయిన ఆరోపణలే చేస్తూ.. అస్తిత్వం చాటుకోవడానికి ఆయన పడే ఆరాటం చూస్తే నవ్వొస్తుంది.
శైలజానాధ్ కష్టం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రఘువీరారెడ్డి పార్టీ పీసీసీ పదవిని వద్దనుకున్న తర్వాత.. ఆ పార్టీ తరఫున అసలు మీడియాలో మాట్లాడే దిక్కే లేకుండా పోయింది. తనకు పీసీసీ పీఠం కట్టెబెట్టిన నాటినుంచి శైలజా.. తాను చురుగ్గా పనిచేస్తున్న నాయకుడిలా కనిపించడానికి తపిస్తున్నారు. ప్రతిరోజూ అయితే ప్రెస్ నోట్ లేదంటే ప్రోగ్రాం. ఇద్దరు నాయకుల మాటల్లోనూ కంటెంట్ మాత్రం ఒక్కటే.
అద్గదీ ఇద్దరు నాయకుల అస్తిత్వ సమస్య!