ఒకవైపు దేశంలోనే అత్యధిక స్థాయిలో కరోనా యాక్టివ్ కేసులున్న రాష్ట్రంగా నిలుస్తోంది కర్ణాటక. ఒక దశలో ఏకంగా ఐదు లక్షల స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదయ్యాయక్కడ. ఇప్పుడు కూడా అత్యధిక స్థాయిలో యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కర్ణాటకే.
ఒకవైపు బీజేపీ నేతలు తాము అధికారం ఛాయల్లో లేని చోట కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై అనవిగాని విమర్శలు చేస్తూ ఉంటారు. పరిస్థితి నియంత్రణలో ఉన్న చోటే వారు విమర్శలు చేస్తూ ఉంటారు. కర్ణాటక మాత్రం వారి కళ్లకు కనపడదు.
ఆ సంగతలా ఉంటే..అంతకన్నా దారుణం, ఇప్పుడు అక్కడి నేతలు అధికారం చేతులు మార్చుకోవడానికి ఉబలాటపడుతూ ఉండటం. యడియూరప్పను దించాలంటూ, దించేయనున్నట్టుగా బీజేపీ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో తన పదవిని కాపాడుకోవడానికి యడియూరప్ప అన్ని యత్నాలూ చేస్తున్నారు. అధిష్టానం దిగిపోమంటే దిగిపోతానంటూనే.. తన కూటమి ఎమ్మెల్యేలతో ఆయన సమావేశాలు షురూ చేశారు.
యడియూరప్పకు మద్దతుగా 65 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారట! వీరంతా ఇప్పటికే ఒక సిట్టింగ్ వేసి, యడ్డిని పదవి నుంచి దించేందుకు వీల్లేదని ప్రకటనలు చేస్తున్నారు. యడ్డిని దించాలనే వారికి ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా లేదని వీరు బహిరంగ వ్యాఖ్యానాలకు దిగారు. ఇలా యడియూరప్ప తన పదవిని నిలబెట్టుకునే ప్రయత్నాలను తీవ్రం చేశారు. అధిష్టానం యడియూరప్పను దించేయడానికి రెడీ అవుతోందనే వార్తలు పుకార్లుగా వస్తున్నాయి.
ఒకవైపు కోవిడ్ కేసులు తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రంలో ఈ తరహా రాజకీయ సంక్షోభం శోచనీయం. కాంగ్రెస్ లో గనుక ఎక్కడైనా ఇలాంటి కుమ్ములాటలు జరుగుతూ ఉంటే బీజేపీ, భక్తులు తీవ్రంగా రచ్చ చేసే వాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలను పట్టించుకోక పదవుల కోసం కీచులాడుతున్న నేతలు మాత్రం దేశభక్తులే, ఇదంతా దేశభక్తే !