థ‌ర్డ్‌వేవ్‌పై అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేస్తున్న జ‌గ‌న్‌

క‌రోనా థ‌ర్డ్ వేవ్ చిన్నారుల‌పై పంజా విసురుతుంద‌నే వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే అప్ర‌మ‌త్త‌మ‌వుతూ, అధికార యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై జ‌గ‌న్ తాప‌త్ర‌యం స్ప‌ష్టంగా…

క‌రోనా థ‌ర్డ్ వేవ్ చిన్నారుల‌పై పంజా విసురుతుంద‌నే వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే అప్ర‌మ‌త్త‌మ‌వుతూ, అధికార యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై జ‌గ‌న్ తాప‌త్ర‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. చిన్నారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించ‌డ‌మే జ‌గ‌న్ ముందు చూపున‌కు నిద‌ర్శ‌నం.

థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని భావించే చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట కేర్ సెంట‌ర్లు సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సి నేషన్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్ పూర్తిస్థాయిలో చ‌ర్చించారు.  

ఒక్కో కేర్‌ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే థర్డ్‌వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలల‌ని కోరారు. పిల్లల్లో కరోనా లక్షణాలు గుర్తించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని బోధనాసుపత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని అధికారుల‌కు జగన్ గైడ్ చేశారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలన్నారు.

థర్డ్‌వేవ్ రాక‌పై ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే థర్డ్‌వేవ్‌ వస్తుందనే భావించి అందుకు అవ‌స‌ర‌మైన మందులను ముంద‌స్తుగా  సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చిన‌ప్పుడే మందులు దొరకవన్నారు.

అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి పరిస్థి తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. థ‌ర్డ్ వేవ్‌పై పోరాడేందుకు జ‌గ‌న్ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేస్తున్నార‌నేందుకు ఆయ‌న తీసుకుంటున్న ముంద‌స్తు చ‌ర్య‌లే నిద‌ర్శ‌నం.