ర‌ఘురామ‌పై సీఐడీ సీరియ‌స్‌

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తీరుపై ఏపీ సీఐడీ సీరియ‌స్ అయ్యింది. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా ర‌ఘురామ ఫిర్యాదు ఉంద‌ని సీఐడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గ‌త నాలుగైదు రోజులుగా త‌న సెల్‌ఫోన్‌ను ఏపీ…

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తీరుపై ఏపీ సీఐడీ సీరియ‌స్ అయ్యింది. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా ర‌ఘురామ ఫిర్యాదు ఉంద‌ని సీఐడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గ‌త నాలుగైదు రోజులుగా త‌న సెల్‌ఫోన్‌ను ఏపీ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోవ‌డంపై ర‌ఘురామ‌కృష్ణంరాజు ఫిర్యాదులు, లీగ‌ల్ నోటీసుల పేరుతో హ‌డావుడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజుకు సీఐడీ తాజాగా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. రఘురామ త‌మ‌కు చెప్పిందానికి, ఢిల్లీ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదుకు తేడా ఉంద‌ని సీఐడీ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సీఐడీ వ్య‌క్తం చేసిన అసంతృప్తి ఏంటో తెలుసుకుందాం.

‘మొబైల్‌ ఫోన్‌ అంశంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ మొబైల్‌ (యాపిల్‌ 11) స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్‌ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్ మెంట్‌ నమోదు చేశాం. మొబైల్‌ ఫోన్‌ సీజ్‌ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపాం.

రఘురామ యాపిల్‌ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించాం. రఘురామ ఫోన్‌ డాటాను మే 31న కోర్టుకు అందించాం. తన ఫోన్‌ సీజ్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు.. రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించాం. తన నెంబర్‌ అంటూ ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. రఘురామ మే 15న మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని’ అని సీఐడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ర‌ఘురామ అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు కొత్త స‌మ‌స్య‌ల‌ను తెర‌పైకి తెస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగ‌మే మొబైల్ ఫోన్ అంశ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదో ర‌కంగా త‌న‌పై న‌మోదైన కేసు గురించి కాకుండా, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చ జ‌రిగేందుకే ఇదంతా అని విమ‌ర్శించే వాళ్లు లేక‌పోలేదు. ఏది ఏమైనా ఈ వ్య‌వ‌హారంపై కోర్టులోనే తేల్చుకునేందుకు సీఐడీ సిద్ధ‌మైన‌ట్టు, తాజా ప్ర‌క‌ట‌న చూస్తే అర్థ‌మ‌వుతోంది. చూద్దాం ఏం జ‌రుగుతుందో!