డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని ప్రభుత్వ వైద్యులు భావించారు. దీంతో జగన్ ప్రభుత్వంపై కరోనా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో తమ డిమాండ్లను పొందుపరిచారు. ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే కరోనా సెకెండ్ వేవ్‌లో తామెలా విధులు నిర్వహింకుండా ప్రభుత్వాన్ని, రోగులను ఇబ్బంది పెడతామని హెచ్చరించారు.
తెలంగాణలో డాక్టర్ల సమ్మెను మరిచిపోకనే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పంథాను ఇక్కడి సీనియర్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఎంచుకున్నారు. సమ్మె సైరన్‌ను మోగించారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించనున్నట్లు ప్రభుత్వానికి తాజాగా ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్నారు.
తమకు కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్‌లో టీడీఎస్ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతో ఈనెల 9 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు ప్రకటించారు.
సమ్మెలో భాగంగా 9వ తేదీన కొవిడ్‌తో సంబంధం లేని విధులు, 10న కొవిడ్ విధులు, 12న కొవిడ్ అత్యవసర విధులను బహిష్క రించాలని నిర్ణయించినట్టు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న క్రమంలో సీనియర్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు వెళ్లడం గమనార్హం.
వైద్యుల సమ్మె ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయని వైద్యులు భావించే, సమ్మెకు వెళుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం, వైద్యుల మధ్య అమాయకులైన ప్రజలు నష్టపోకుండా సత్వర చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.