ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరో పది రోజుల పాటు కర్ఫ్యూను సడలించేందుకు నిర్ణయించింది. పగటి పూట కర్ఫ్యూ ఈ నెల 10వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇదే సమయంలో ఈ నెల 11 నుంచి స్వల్ప సడలింపులు కూడా చేపట్టింది. ప్రస్తుతం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఈ సమయంలో ప్రజలు తమ పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంది. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జగన్ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా గత నెల 5న మొదటిసారిగా కర్ఫ్యూ విధించింది. 18వ తేదీ వరకూ అమల్లో ఉంటుందని చెప్పింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో మరోసారి మే నెలాఖరు వరకూ పొడిగించింది. మళ్లీ జూన్ 10వ తేదీ వరకూ పొడిగించింది.
ఇప్పుడు ఆ గడువు ముగింపు దశకు చేరడంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో సమీక్షించారు. ముచ్చటగా నాలుగోసారి కర్ఫ్యూ పొడిగించారు. అయితే పగటి పూట కర్ఫ్యూలో మరో రెండు గంటలు వెసులుబాటు ఇవ్వడం గమనార్హం.