విశాఖ కార్పొరేషన్లో టీడీపీకి 30మంది కార్పొరేటర్ల బలం ఉంది. అయితే ఆ పార్టీ ఇటీవల నిర్వహించిన సమావేశానికి అందులో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. మిగతావారంతా డుమ్మా కొట్టారు. పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, అకారణంగా నిందలేసేందుకు కార్పొరేటర్లను వాడుకోవాలని చూస్తున్నారు మాజీ నాయకులు.
తాము చెప్పినట్టల్లా వినాలని హుకుం జారీ చేస్తున్నారు. అధికార పార్టీతో సఖ్యతగా ఉండి, తమ ప్రాంత అభివృద్ధికి కలసి నడవాలనుకుంటున్న యువ కార్పొరేటర్లకు, టీడీపీ బ్లేమ్ గేమ్ రుచించడంలేదు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చి నెలలు గడిచేలోపే వారంతా పచ్చ పార్టీకి దూరంగా జరిగిపోతున్నారు.
నడిపించే నాయకుడు ఎక్కడ..?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నలుదిక్కులూ టీడీపీ వశమయ్యాయి. కానీ అందులో ఓ దిక్కు(వాసుపల్లి గణేష్) ఇప్పటికే వైసీపీ గూటికి చేరింది. మరో దిక్కు గంటా శ్రీనివాసరావు అసలు టీడీపీలో ఉన్నారా లేదా అనేది అనుమానమే. గణబాబు కూడా టీడీపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు, వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమే టీడీపీతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే విచిత్రంగా ఆ జిల్లా పెత్తనం మాత్రం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి అప్పగించింది పార్టీ. దీంతో ఆయన కార్పొరేటర్లపై పెత్తనం చలాయించాలని చూస్తున్నారు. అందుకే వారంతా పార్టీకి దూరమవుతున్నారు.
పాలనా రాజధాని విశాఖకు తరలి వస్తుందని ఇటీవల వైసీపీ కీలక నేతలు చేసిన వరుస ప్రకటనలతో టీడీపీ ఆలోచనలో పడింది. ముందుగా విశాఖ కేంద్రంగా నిరసనలు చేపట్టడానికి సమాయత్తమైంది. వారం రోజులపాటు నిరసన కార్యక్రమాల షెడ్యూల్ కూడా విడుదలైంది. దీని కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో టీడీపీ షాకయ్యింది.
పాలనా వ్యవహారాల్లో లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ, చీటికి మాటికి విమర్శలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతామంటూ ఇటీవలే ఓ సీనియర్ కార్పొరేటర్ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో మిగతా వారు కూడా ఆలోచనలో పడ్డారు. అభివృద్ధి చేసే ప్రభుత్వంతో వెళ్లాలా, అభాసుపాలు చేసే ప్రతిపక్షంతో అంటకాగాలా అని చర్చించుకుంటున్నారు. అటు పల్లా వ్యవహారం కూడా కార్పొరేటర్లకు రుచించడంలేదు.
టీడీపీ అధినాయకత్వం అనుమతి లేకుండానే ఆయన గాజువాక నియోజకవర్గానికి తన మేనల్లుడిని ఇన్ చార్జిగా పెట్టడం స్థానిక నాయకులకు రుచించలేదు. దీంతో ఆయనకు దూరంగా ఉంటున్నారు టీడీపీ నేతలు, పార్టీకి కూడా దూరమయ్యారు. 30 మందిలో ఇప్పుడు ముగ్గురు మాత్రమే నికరంగా టీడీపీ వైపు నిలబడ్డారు.