టీఆర్ఎస్‌లోకి ఎల్‌.ర‌మ‌ణ‌!

తెలంగాణ టీడీపీలో ఉన్న ఒక‌రిద్ద‌రు ముఖ్య‌నేత‌లు కూడా చేజారుతున్నారు. టీఆర్ఎస్‌లోకి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్‌.ర‌మ‌ణ చేర‌నున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.  Advertisement ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ ఆవిర్భ‌వించిన నేప‌థ్యంలో టీడీపీ…

తెలంగాణ టీడీపీలో ఉన్న ఒక‌రిద్ద‌రు ముఖ్య‌నేత‌లు కూడా చేజారుతున్నారు. టీఆర్ఎస్‌లోకి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్‌.ర‌మ‌ణ చేర‌నున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ ఆవిర్భ‌వించిన నేప‌థ్యంలో టీడీపీ నెమ్మ‌దిగా క‌నుమ‌రుగ‌వుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ చెప్పుకోత‌గ్గ అసెంబ్లీ సీట్లు సాధించిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత కాలంలో ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతూ వ‌చ్చారు. అయితే ఎల్‌.ర‌మ‌ణ మాత్రం పార్టీని అంటిపెట్టుకుని చంద్ర‌బాబుకు ఎంతో న‌మ్మ‌కంగా ఉంటూ వ‌స్తున్నారు. టీడీపీలో నిబ‌ద్ధ‌త గ‌ల నేత‌గా ఎల్‌.ర‌మ‌ణ‌కు పేరు.

ఇటీవ‌ల టీడీపీ నిర్వ‌హించిన మ‌హానాడులో కూడా ఎల్‌.ర‌మ‌ణ పాల్గొని తెలంగాణ‌కు సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా చేశారు. తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతానికి నిర్ణ‌యించారు. మ‌రోవైపు తెలంగాణ‌లో రాజ‌కీయంగా చోటు చేసుకున్న‌ కీల‌క ప‌రిణామాలు ఎల్‌.ర‌మ‌ణ ఆలోచ‌న‌లో మార్పు తీసుకొచ్చాయి. ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కావ‌డం, ఆ త‌ర్వాత పార్టీ, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డిన‌ట్టైంది.

ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ మారే విష‌య‌మై త‌న స‌న్నిహితుల‌తో ఎల్‌.రమ‌ణ కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు టీడీపీకి తెలంగాణ‌లో భ‌విష్య‌త్ లేద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన నేపథ్యంలో బీజేపీ నేత‌ల‌తో కూడా ఎల్‌.ర‌మ‌ణ ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. లాభ‌న‌ష్టాల బేరీజు అనంత‌రం టీఆర్ఎస్‌లో చేర‌డ‌మే స‌రైంద‌నే అభిప్రాయానికి ఎల్‌.ర‌మ‌ణ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. 

ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌లో బీసీల వ్య‌తిరేక పార్టీగా టీఆర్ఎస్‌పై ముద్ర ప‌డుతుంద‌నే భ‌యం ఆ పార్టీ నేత‌ల‌ను వెంటాడుతోంది. దీంతో ఎల్‌.ర‌మ‌ణ‌ను చేర్చుకోవ‌డం ద్వారా న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నార‌ని స‌మాచారం.  

సీఎం కేసీఆర్‌ నుంచి స్పష్టమైన హామీనే త‌రువాయి…ఎల్‌.ర‌మ‌ణ టీఆర్ఎస్‌లో చేర‌డం కేవ‌లం లాంఛ‌న‌మే అంటున్నారు. టీఆర్ఎస్‌లో ఎల్‌.ర‌మ‌ణ చేరిక‌పై అధికార పార్టీ నేత‌లు కూడా అన‌ధికారికంగా నిర్ధారిస్తున్నారు.