కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటివరకూ అది ఒక కొలిక్కి మాత్రమే వచ్చింది. జూలై ఒకటో తేదీన రేగిన రచ్చ కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడంతో ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది.
అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ఎన్నాళ్లు ఉంటుంది? అనేది మాత్రం సందేహాస్పదంగానే మిగిలే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అంతా కలుపుకుంటే ఉండే బలం 105. రాజీనామాలు ఇచ్చిన ఎమ్మెల్యేల సంగతిని కోర్టే తేల్చాలి!
రేపు యడ్యూరప్ప బలనిరూపణ సమయంలో వారు బీజేపీకి మద్దతు పలికితే వారిపై అనర్హత వేటు పడాల్సి ఉంటుంది. అప్పుడు స్పీకర్ ఎవరుంటారు? ఏం నిర్ణయం తీసుకుంటారు? వారిపై కోర్టు ఎలా వ్యవహరిస్తుంది? తమ రాజీనామాలను ఆమోదించాలంటూ వారే ఆల్రెడీ కోర్టుకు ఎక్కారు కాబట్టి.. వారికి మళ్లీ బలనిరూపణ అప్పుడు ఓటేసే అవకాశం అయినా ఉంటుందా? ఇవన్నీ ప్రస్తుతానికి మిస్టరీతో కూడుకున్న అంశాలే.
ఒకవేళ ఈ రాజీనామా ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే, లేదా వారి రాజీనామాలు ఆమోదింపబడితే ఉప ఎన్నికలు అనివార్యం కాగలవు. అప్పుడు ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారు? అనేది కూడా యడ్యూరప్ప ప్రభుత్వం ఉండటమా, కూలటమా? అనే అంశాలను నిర్దేశించవచ్చు.
అలాకాకుండా.. అధికారం దక్కగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం కూడా బీజేపీకి ఉన్న అంశం. అయితే వరసగా ఎన్నికలను ఎదుర్కొనడం ఆర్థికంగా భారమంటున్నారట కర్ణాటక కమలనాథులు. ఇదంతా చూస్తుంటే మాత్రం కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి డైలీ సీరియల్ లా కొనసాగే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.