తెలంగాణ ముఖ్యమంత్రికి ఎట్టకేలకు కోపం చల్లారింది. ఆర్టీసీ కార్మికులపై కనికరం చూపారు కేసీఆర్. బంతి తన కోర్టులోనే ఉన్నప్పటికీ, హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు ఇచ్చినప్పటికీ కార్మికుల విషయంలో దూకుడుగా వెళ్లలేదు కేసీఆర్. శుక్రవారం నుంచి కార్మికులంతా సంతోషంగా విధుల్లో చేరవచ్చని తీపికబురు అందించారు. అంతేకాదు.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని స్పష్టంచేశారు.
ఇక్కడితో అయిపోలేదు.. కార్మికులకు చిన్నచిన్న చురకలు అంటిస్తూనే వాళ్లను బుజ్జగించారు ముఖ్యమంత్రి. కేవలం కార్మికులకు తమ తప్పు తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లూ కటువుగా ప్రవర్తించానని, ఇకనైనా సంఘాల వెంటపడడం మానుకోవాలని సూచించారు. కార్మిక యూనియన్లను మాత్రం క్షమించేదిలేదని ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.
సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు కేసీఆర్. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి తరహాలో బోనస్ లు ఇచ్చే స్థాయికి ఆర్టీసీ ఎదగాలని, ఇకపై కార్మికులంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు. తాత్కాలిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు తక్షణం ఆర్టీసీకి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
తన ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే డిపోకు ఐదుగురు చొప్పున కార్మికుల్ని పిలిపించి మాట్లాడతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని వివరాలు, హామీలు వాళ్లతో పంచుకుంటానని, యూనియన్లను మాత్రం రానివ్వనని స్పష్టంచేశారు. ఇకనైనా యూనియన్లు చెప్పే చిల్లర మాటల్ని పట్టించుకోవద్దని కార్మికులకు హితవు పలికారు.
మొత్తమ్మీద కేసీఆర్ శాంతించడంతో 52 రోజుల పాటు సుదీర్ఘంగా కార్మికులు చేసిన సమ్మెకు తెరపడింది. రేపట్నుంచి తెలంగాణ అంతటా పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. అయితే ప్రయాణికులపై మాత్రం కేసీఆర్ భారం మోపారు. కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున టిక్కెట్ రేట్లు పెంచారు. అంటే.. కార్మికులు సమ్మె చేసినప్పుడు ఇక్కట్లు పాలైంది ప్రయాణికులే, ఇప్పుడు సమ్మె తర్వాత ఆ నష్టాల్ని భరించేది కూడా ప్రయాణికులే అన్నమాట.