ఆర్టీసీ ఆత్మగౌరవమా..? కేసీఆర్ నియంతృత్వమా..?

ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం అంటూ నానా యాగీ చేసిన ప్రజా సంఘాలు ఇప్పుడెక్కడికి పోయాయి? రాష్ట్ర విభజన కోసం ఏకతాటిపైకి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఏ రాజకీయ ముసుగు తొడుక్కుని…

ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం అంటూ నానా యాగీ చేసిన ప్రజా సంఘాలు ఇప్పుడెక్కడికి పోయాయి? రాష్ట్ర విభజన కోసం ఏకతాటిపైకి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఏ రాజకీయ ముసుగు తొడుక్కుని తమ రంగులు మార్చుకున్నాయి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టాయి? ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే కనీసం చర్చలకు పిలవడానికి కూడా ప్రభుత్వానికి ఎందుకు నోరు రావడం లేదు. అప్పుడు అక్కరకొచ్చిన ఆత్మగౌరవ నినాదాన్ని ఇప్పుడు కేసీఆర్ కాళ్ల దగ్గర ఎందుకు తాకట్టు పెట్టారు? తెలంగాణలో ప్రతి సామాన్యుడి మనసులో మెదులుతున్న ప్రశ్నలివి.

రాష్ట్ర విభజనతో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించి భంగపడ్డ సగటు తెలంగాణ పౌరులు.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ వ్యాఖ్యలు చూసి విస్తుపోయారు. ఆంధ్రోళ్ల జాగీరు అనుకున్నది కాస్తా కేసీఆర్ జాగీరైపోయిందని అనుకుంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారు. ఈరోజు సాయంత్రంలోగా పనిలోకొచ్చేవాళ్లే ఆర్టీసీ ఉద్యోగులు, సాయంత్రం డ్యూటీల్లో చేరకపోతే వారు స్వచ్ఛందంగా కొలువుకి రాజీనామా చేసినట్టే. ఇదీ ఆయన సందేశం.

కేసీఆర్ నియంతృత్వానికి మారుపేరని చాలామంది అంటుంటారు. తనమాటే నెగ్గాలని లేకపోతే తనామనా చూడరని చెబుతుంటారు. దీనికి తాజా నిదర్శనమే ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ కొట్లాట. విచిత్రం ఏంటంటే.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడాలని పిలుపునిచ్చారో.. ఇప్పుడు అదే ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి మరీ విధులకు రావాలని కేసీఆర్ అల్టిమేట్టం జారీ చేశారు. చర్చలు ఉండవని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారంటే పరిస్థితి ఏంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కార్మికులెవరూ ఖాళీగా ఉండి ఉద్యమాలు చేయరు, న్యాయమైన కోర్కెల కోసమే రోడ్డెక్కుతారు. వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందులోనూ తెలంగాణలో ఉన్నది మామూలు పార్టీ కాదు, అదొక ఉద్యమ పార్టీ. అలాంటి ఉద్యమ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ ఆర్టీసీలో ఓ యూనియన్ కు గతంలో గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు కనీసం కార్మికుల తరపున మాట్లాడ్డం లేదంటే అధికారం ఎంతటివారికైనా చేతులు కట్టేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్ చేస్తుంది తప్పు అని ప్రభుత్వంలో ఉన్న చాలామందికి అనిపించి ఉండొచ్చు, కానీ చెప్పే ధైర్యం చేయలేకపోవడమే ఇప్పుడు వచ్చిన సమస్య అంతా. ఉమ్మడి రాష్ట్రంలో కాదు, తెలంగాణ వచ్చిన తర్వాతే అక్కడి ప్రజలు నిజమైన బానిసలుగా మారిపోయారని, ప్రభుత్వం వారిని అలా మార్చేసిందని అంటున్నారు చాలామంది. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం ఈ వ్యవహారంలో బాగా సీరియస్ గా ఉన్నారు. కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. ఆర్టీసీ ఆత్మగౌరవమా, కేసీఆర్ నియంతృత్వమా.. సాయంత్రానికి ఏదో ఒకటి తేలిపోతుంది.

అల్లువారింట్లో సైరా పార్టీ.. అక్కినేని హీరో కూడా