ఏపీ కోసం కేసీఆర్ వకాల్తా.. ఇరుకున పడ్డ కేంద్రం

అదేంటి.. కేసీఆర్ పోరాటాలన్నీ తెలంగాణ బాగు కోసమే కదా, పరోక్షంగా ఏపీకి వ్యతిరేకంగానే కదా.. ఈమధ్య నీటి వాటాల దగ్గర కూడా కేసీఆర్ ఎంతో పట్టుబడ్డారు కదా, మరిప్పుడు ఏపీకి కేసీఆర్ ఎందుకు సపోర్ట్…

అదేంటి.. కేసీఆర్ పోరాటాలన్నీ తెలంగాణ బాగు కోసమే కదా, పరోక్షంగా ఏపీకి వ్యతిరేకంగానే కదా.. ఈమధ్య నీటి వాటాల దగ్గర కూడా కేసీఆర్ ఎంతో పట్టుబడ్డారు కదా, మరిప్పుడు ఏపీకి కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు రహస్యం.

ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. తెలంగాణ కోసం వరాలు అడుగుతూనే పనిలో పనిగా విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తున్నారు. అయితే చట్టంలో తెలంగాణకు ఇస్తామన్న వాటిపైనే కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా.. అసలు దాన్ని అమలు పెట్టడం మొదలు పెడితే, తెలంగాణ కంటే ఏపీకే కేంద్రం ఎక్కువగా పనులు చేయాల్సి వస్తోంది. ఒకవేళ కేసీఆర్ ఒత్తిడి ఫలించి కేంద్రం విభజన చట్టాన్ని పట్టించుకుని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తే అది తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ లాభం.

ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. కేంద్రాన్ని వరాలు అడుగుతున్నారు. అయితే అవి విభజన చట్టంలోనివేనంటున్నారు. ఏడేళ్లు గడిచినా ఇంకా విభజన చట్టాన్ని ఎందుకు అమలు పరచడంలేదంటూ కేంద్రాన్ని నిలదీశారు కేసీఆర్. ప్రధాని మోదీ సహా, అమిత్ షా ముందు కూడా తన కోర్కెల చిట్టా పెట్టారు. జిల్లాల సంఖ్యను పెంచుకున్నామని, దానికి అనుగుణంగా ఐపీఎస్ లను పెంచాలని కోరారు. గిరిజన యూనివర్శిటీ సహా, ఇతర వ్యవహారాలను కూడా త్వరగా తెమల్చాలన్నారు.

అయితే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. కేవలం యాదాద్రి ప్రారంభోత్సవానికి మాత్రం వస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చి కేసీఆర్ ని సాగనంపారు. అయితే హస్తిన వేదికగా మరోసారి విభజన చట్టం వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది.

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయం చేయాలని చూస్తే మాత్రం ఏపీకి కూడా న్యాయం చేయాల్సిందే. అంటే ఏపీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి తీరాలి. ఆమాటకొస్తే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ కచ్చితంగా దాన్ని హైలెట్ చేస్తుంది. అంటే ఒకరకంగా కేసీఆర్ పర్యటనతో కేంద్రం ఇరుకునపడ్డట్టేనని చెప్పాలి. అలా తెలంగాణ కోసం గొంతెత్తిన కేసీఆర్, పనిలో పనిగా ఏపీ తరపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టయింది.