మోడీ సర్కార్‌కు సొంత పార్టీ యువ ఎంపీ వరుణ్‌గాంధీ గట్టి షాక్ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమానికి ఆయన సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించి… మోడీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా చేశారు. అంతేకాదు, సొంత ప్రభుత్వానికి ఆయన హితవు పలకడం విశేషం.
మూడు సాగు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధర కోసం చట్టం తీసుకురావాలని రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేస్తుండడం తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు సూచించినా చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
మరోవైపు చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతులు భీష్మించారు. ఈ నేపథ్యంలో రైతులకు వరుణ్‌గాంధీ మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్షాలకు గట్టి ఆయుధం ఇచ్చినట్టైంది. రైతులకు మద్దతు తెలిపే వరుణ్‌గాంధీ ట్వీట్ ఎలా సాగిందంటే…
''లక్షలాది మంది రైతులు ముజఫర్‌నగర్‌లో నిరసనలకు ఇవాళ సమావేశమయ్యారు. రైతులు మన సొంత మనుషులు. గౌరవప్రదంగా వారితో తిరిగి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. వారి బాధను అర్ధం చేసుకోండి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారితో కలిసి ఒక పరిష్కారానికి కృషి చేయాలి'' అని వరుణ్ గాంధీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుణ్‌గాంధీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మనవడు. సంజయ్‌గాంధీ కుమారుడే వరుణ్‌గాంధీ. ఈయన ఫిలిబిత్ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుణ్ తల్లి మేనకాగాంధీ కూడా ఎంపీనే. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమె గతంలో కేంద్ర కేబినెట్‌లో పనిచేశారు.
జంతు ప్రేమికురాలిగా దేశ వ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది. రైతుల ఉద్యమానికి మద్దతు పలికిన వరుణ్‌గాంధీపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.