ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో స్నేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కటీఫ్ చెప్పారా? అంటే అవుననే అనుకోవాలి. ఈ నిర్ణయానికి ఎందుకు రావాల్సి వచ్చిందో చర్చించుకుందాం.
బీజేపీకి వ్యతిరేకంగా డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్‌లో కేసీఆర్ నేతృత్వంలో ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయమై స్వయంగా కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీఆర్ఎస్ భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు.
బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో నిర్వహించే సమావేశానికి పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, వివిధ రాష్ట్రాల సీఎంలు కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతి, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరు కానున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే కేసీఆర్ చెప్పిన పేర్లలో సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, స్నేహితుడైన వైఎస్ జగన్ లేకపోవడం గమనార్హం.
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయంతో తెలంగాణలో ఆ పార్టీ తామే ప్రత్యామ్నాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా, కేసీఆర్‌పై దూకుడుగా వ్యవహరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకుని సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో దూసుకెళ్లేందుకు బీజేపీ సన్నాహాలు చేసుకుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ పని పట్టాలని కేసీఆర్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో బుధవారం తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో బీజేపీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని ఆయన హెచ్చరించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో త్వరలో హైదరాబాద్‌లో బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా పలువురు ముఖ్య నేతల పేర్లను తెరపైకి తెచ్చారు. అయితే జగన్ గురించి మాట్లాడకపోవడంతో ఇక ఏపీ సీఎంతో బంధాన్ని తెంచుకున్నట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా రాయలసీమ బృహత్తర సాగునీటి పథకం విషయమై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రజలవనరులశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్, జగన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో తమతమ రాష్ట్ర ప్రయోజనాల విషయమై వ్యక్తిగత బంధాలను ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కన పెట్టారు.
అంతేకాకుండా, బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆయన్ను పరిగణలోకి తీసుకోకూడదని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఏది ఏమైనా అనేక కారణాల రీత్యా కేసీఆర్ కంటే జగన్‌కు మోడీ-అమిత్‌షానే ముఖ్యమనే సంగతి బహిరంగ రహస్యమే.