తాము ఇచ్చిన గడువుమేర విధుల్లో చేరిన పన్నెండు వందల మంది మాత్రమే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు అని, మిగిలిన వారంతా ఇకపై ఆర్టీసీ ఉద్యోగులే కాదని తేల్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మెపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులది అహంభావం అని కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. వారి అహంకారపు ధోరణితోనే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందన్నారట.
వారిని ఉద్యోగాల నుంచి తాము తొలగించలేదని, వారే ఉద్యోగాలను వదులుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తుండటం గమనార్హం. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలలో సమ్మె చేసిన వారే ఇప్పుడు కూడా సమ్మె చేస్తున్నారని.. అప్పటికీ ఇప్పటికీ తేడా లేదా.. అన్నారట కేసీఆర్!
ఆర్టీసీని మొత్తంగా పునర్వ్వస్థీకరిస్తున్నట్టుగా ప్రకటించుకున్నారట. కొత్త వాళ్ల రిక్రూట్ మెంట్ ను యుద్ధ ప్రాతిపదికన చేయాలని, కొత్త వ్యూహాలతో వెళ్లాలని, సంస్థను గొప్పగా తీర్చిదిద్దాలని, కార్మికులకు బోనస్ ఇచ్చే పరిస్థితి రావాలని వ్యాఖ్యానించారట తెలంగాణ ముఖ్యమంత్రి! ఉన్న వాళ్లందరినీ తీసేసి, కొత్త వాళ్లను రిక్రూట్ చేసి, వాళ్లకు బోనస్ లు అంటూ కేసీఆర్ మాట్లాడుతుండటం విడ్డూరం.
మొత్తానికి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని తెగేవరకూ లాగుతున్నట్టుగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలే లేవు, వారు ఉద్యోగులే కాదని కొన్ని వేలమంది విషయంలో తేలికగా తేల్చేస్తున్నారు. ఇదంతా కార్మికులను బెదిరించే చర్య మాత్రమేనా? లేక తెగే వరకూ కేసీఆర్ లాగేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు.
అధికారంలో ఉన్నవారు తెగేవరకూ లాగితే, ఆ తర్వాత ఇలాంటి వారిని ప్రతిపక్షానికి పంపడం ప్రజలకూ కష్టం కాదేమో!