హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అటు టీఆర్ఎస్ బహిష్కృత నేత ఈటల, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి రేవంత్ రెడ్డి.. ఇద్దరూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మాటలకు పదును పెట్టారు. అయితే ఆ స్పీడ్ కి ఇప్పుడు బ్రేక్ పడింది.
బహుశా ఎన్నాళ్లు బ్రేక్ వేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వారిద్దరూ. ఉప ఎన్నికలను తెలివిగా పక్కనపెట్టిన కేసీఆర్.. ఈటల, రేవంత్ ఇద్దరికీ షాకిచ్చారు. తెలంగాణలో ఎగిరెగిరి పడుతున్న నేతలందరి నోళ్లకు తాళం వేశారు.
రాష్ట్ర స్థాయి నేతగా పేరున్న ఈటల రాజేందర్ అనూహ్యంగా హుజూరాబాద్ స్థానిక నేతగా మారిపోవడానికి కూడా కారణం కేసీఆరే. ఈటల దృష్టంతా ఇప్పుడు హుజూరాబాద్ పైనే ఉంది. అక్కడ గెలిస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే బీజేపీలో చేరిన పాపానికి.. ఓడిపోయిన నేతగా అందరూ చిన్నచూపు చూస్తారు. అందుకే ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన ఈటలకు కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో షాక్ ఎదురైంది.
రాష్ట్రంలో కరోనా భయాలు తొలగిపోలేదని, ఎన్నికలు ఇప్పుడే వద్దని కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు హుజూరాబాద్ ఉప ఎన్నికలను సీఈసీ పక్కనపెట్టింది. దీంతో అటు ప్రచారానికి వెళ్లలేక, ఇటు సైలెంట్ గా ఉండలేక ఈటల సతమతం అవుతున్నారు.
ఎగిరెగిరిపడ్డ రేవంత్ ఎక్కడ..?
హుజూరాబాద్ లో గతంలో కాంగ్రెస్ ది సెకండ్ ప్లేస్. కానీ ఇప్పుడది ఏ స్థానంలో ఉందో ఎవరికీ తెలియదు. ఈటల చేరికతో బీజేపీ బలపడటం, కౌశిక్ రెడ్డి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ వీక్ కావడం రెండూ సైమల్టేనియస్ గా జరిగాయి. అధికార పార్టీ అన్న బలం టీఆర్ఎస్ కు ఎలాగూ ఉంది.
సో.. కొత్తగా పీసీసీ పీఠం చేపట్టిన రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ లో కాంగ్రెస్ ని గెలిపించడం ప్రతిష్టాత్మకంగా మారింది. గెలవడం అటుంచి, కనీసం రెండో స్థానంలో నిలబడినా అదే పదివేలు అనుకుంటున్నారు రేవంత్.
అందుకే పదవి వచ్చిన తర్వాత పదే పదే కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తిట్లు, శాపనార్థాలతో లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఉప ఎన్నిక వెనక్కి వెళ్లిపోవడం ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా కష్టంగా మారింది. బై ఎలక్షన్ ని అడ్డు పెట్టుకుని కేసీఆర్ ని తిడుతూ మైలేజ్ పొందాలనుకున్న రేవంత్ నోటికి ఇప్పుడు తాళం
పడిపోయింది.
ఎన్నికల టైమ్ కాదు కాబట్టి ఇక వీరెవరూ జోరుగా జనాళ్లోకి వెళ్లలేరు, ఆ లోగా వీరి ఆవేశం చల్లారుతుంది. ఏదో ఒక శుభ మహూర్తాన ఉరుములేని పిడుగులా ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించి కేసీఆర్ వ్యూహ రచన చేస్తారు. అప్పుడు మేలుకున్నా వీరికి ఉపయోగం ఉండదు. ఈలోగా దళిత బంధు లాంటి పథకాలను అమలులో పెట్టి ప్రభుత్వం బాగా మైలేజీ సాధిస్తుంది.
హుజూరాబాద్ లో సునాయాస విజయాన్ని దక్కించుకుంటుంది. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ఎన్నికలను వెనక్కు తీసుకెళ్లారు. పరోక్షంగా ఈటల, రేవంత్ ని దెబ్బకొట్టారు.